3 April, 2026 | 9:32 PM

దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు ప్రారంభం

03-04-2026 07:52 PM

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో పండిట్ దీన్దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద, క్రమశిక్షణ కలిగిన పార్టీగా బీజేపీ నిలిచిందన్నారు. ఈ శిక్షణ తరగతులు శుక్రవారం, శనివారం కొనసాగనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో ఉండడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని అన్నారు.

స్వార్థరహిత రాజకీయాలతో ప్రారంభమైన భారతీయ జన సంఘ్ కేవలం రెండు సీట్లతో మొదలై, నేడు దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడం పార్టీ క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడిన నాయకుల సేవలను గుర్తుచేశారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జీవితం, సేవల గురించి విపులంగా వివరించి, ఆయన ఆలోచనలు ప్రతి కార్యకర్తకు మార్గదర్శకమని అన్నారు. ప్రపంచంలో అతి పెద్ద పార్టీగా ఎదగడంలో పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.