13 March, 2026 | 3:13 AM

యుద్ధం ఆపేస్తాం.. కానీ మూడు షరతులు

13-03-2026 12:09 AM

ఇరాన్ సార్వభౌమాధికారం, హక్కులను గుర్తించాలి

ఈ 13 రోజుల్లో దాడులకు నష్ట పరిహారం చెల్లించాలి

ఇక ఇరాన్‌పై దాడులూ చేయమని హామీ ఇవ్వాలి

అమెరికా, ఇజ్రాయెల్‌కు ఇరాన్ అల్టిమేటం

టెహ్రాన్, మార్చి 12: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా బాంబుల మోత, క్షిపణులు, డ్రోన్ల దాడి తగ్గడం లేదు. ఒకవైపు మేము గెలిచాం అని ట్రంప్ ప్రకటిస్తుంటే.. మరోవైపు షరతులకు ఒప్పుకుంటేనే శాంతి అంటూ ఇరాన్ సవాల్ విసురుతోంది.

హోర్ముజ్ జలసంధి మూతపడి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భగభగ మండుతున్న వేళ.. ఇరాన్ అధ్యక్షుడు పెట్టిన ఆ మూడు డిమాండ్లు ఏంటి, వాటిని అమెరికా, ఇజ్రాయెల్ తీర్చేంత ఆమోదయోగ్యంగానే ఉన్నాయా లేదో వివరాల్లోకి వెళుదాం పదా.. పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు 13వ రోజుకు చేరుకున్నాయి. ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన ఈ భీకర పోరులో ఇంకా ఉధృతంగా నడుస్తోంది.

అయితే ఈ యుద్ధానికి ముగింపు పలకాలంటే తాము విధించిన మూడు ప్రధానషరతులకు అగ్రరాజ్యం సహా ఇజ్రాయెల్ అంగీకరించాల్సిందేనని ఇ రాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో చర్చలు జరిపిన అనంతరం.. మసౌద్ పెజిష్కియాన్ ఎక్స్ వేదికగా శాంతి స్థాపనకు మార్గాన్ని సూచించారు. అమెరికా, ఇజ్రాయెల్ ప్రేరేపిత ఈ యుద్ధం ఆగాలంటే ఈ కింది డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ఒకటోది అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, దాని చట్టబద్ధమైన హక్కులను గుర్తించాలని తెలిపారు. రెండోది.. ఈ 13 రోజుల్లో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టానికి అమెరికా, ఇజ్రాయెల్ భారీగా నష్ట పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. మూడోది భవిష్యత్‌లో ఇరాన్‌పై ఎలాంటి దాడులు జరగవని అంతర్జాతీ య సమాజం నుంచి హామీ లభించాలన్నా రు. మరోవైపు బుధవారం ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మేము ఇప్పటికే ఇరాన్ యుద్ధంలో విజయం సాధించాం’అని ప్రకటించారు. అయితే లక్ష్యం పూర్తిగా నెరవేరే వరకు అమెరికా సై న్యం అక్కడ మోహరించి ఉంటుందన్నారు. ఓవైపు ఇరాన్ షరతులు విధిస్తుంటే, మరోవైపు ట్రంప్ తన మొండి వైఖరిని ప్రదర్శిస్తుండడం చూస్తుంటే.. శాంతి చర్చలు ఫలించేలా కనిపించడం లేదు.