ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
- ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్
- టీఆర్పీ అనుబంధంగా బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిర్భావం
- చైర్మన్‌గా సంపత్ ముదిరాజ్
- కార్మికులకు 5 లక్షల బీమా సదుపాయం
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ కార్మిక సంఘంగా బహుజన వర్కర్స్ యూనియన్ (బీడబ్ల్యూయూ)ను పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఆవిష్కరించారు. చైర్మన్‌గా సంపత్ ముదిరాజ్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని బేషరతుగా, పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయడమే యూనియన్ ఏకైక డిమాండ్, సింగిల్ పాయింట్ ఎజెండా అని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు తీవ్ర అభద్రతాభావంతో బతుకుతున్నారని, వేల కోట్ల విలువైన ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టి, సంస్థను ప్రైవేటీకరించేందుకు గత పాలకులు కుట్రలు చేశారని మల్లన్న విమర్శించారు. దళారీ వ్యవస్థను నడిపే ఇతర సంఘాలకు కేవలం యూనియన్ ఎన్నికలపైనే ఆసక్తి ఉందని, బహుజన వర్కర్స్ యూనియన్‌కు ఆర్టీసీ కార్మికుల సంక్షేమమే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యూనియర్ ప్రధాన హామీలు, కార్యాచరణ ప్రకటించారు.
బహుజన వర్కర్స్ యూనియన్ కార్మికులందరికీ పార్టీ తరపున రూ.5 లక్షల ఉచిత బీమా సదుపాయం కల్పిస్తామని ప్రకటించారు. రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు రావలసిన పెండింగ్ బెనిఫిట్స్ ఇప్పించేలా ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కార మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. పార్టీకి, యూనియన్‌కు మధ్య కోఆర్డినేటర్‌గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు సంకూరి శ్రీనివాస్ వ్యవహరిస్తారని తెలిపారు.
రాబోయే రెండు మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోలలో బహుజన వర్కర్స్ యూనియన్ జెండా ఎగరవేస్తామని, ఆర్టీసీ విలీనం కోసం నిరంతరం కష్టపడే శక్తిగా యూనియన్ను మారుస్తామని తీన్మార్ మల్లన్న ఉద్ఘాటించారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజిని కుమార్ యాదవ్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజ, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, ఎంబీటి పార్టీ ప్రతినిధి అంజద్ ఉల్లాఖాన్ పాల్గొన్నారు.






