22 June, 2026 | 3:35 AM

మా పోరాటానికి మద్దతు ఇవ్వండి

22-06-2026 02:16 AM

కేటీఆర్‌కు హైకోర్టు న్యాయవాదుల సంఘం విజ్ఞప్తి

అండగా ఉంటామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హామీ

హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): తెలంగాణ న్యాయవాదుల న్యాయబద్ధమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నంది నగర్‌లో కేటీఆర్‌ను తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం కలిసింది.

హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందిన న్యాయవాదుల పేర్లనే పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సంఘం ఇటీవల తీసుకున్న తీర్మానాన్ని వారు కేటీఆర్‌కు వివరించి ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

తమ సంఘం లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి, వాటి అమలుకు ప్రధాన ప్రతిపక్షం తరపున డిమాండ్లను సాధించేందుకు ప్రభుత్వం పైన ఒత్తిడి చేయాలని కోరారు.  రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైకోర్టు నియామకాల్లో ఇతర ప్రాంతాలకు చెందిన వారు స్థానికతను తప్పుగా చూపుతూ అవకాశాలను దక్కించుకుంటున్నారని, దీనివల్ల తెలంగాణకు చెందిన అర్హులైన న్యాయవాదులకు అన్యాయం జరుగుతోందని సంఘం ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ అంశంపై జూన్ 15, 2026న జరిగిన అత్యవసర సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశామని, దానిలో భాగంగానే జూన్ 17, 2026న హైకోర్టులో నిరసన ప్రదర్శన నిర్వహించామన్నారు. న్యాయవాదులు లేవనెత్తిన ప్రతి అంశం న్యాయమైందని.. తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడే పార్టీగా న్యాయవాదులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో ఆ సంఘం ఉపాధ్యక్షులు డీఎల్ పాండు, కార్యదర్శులు పీ. శ్రవణ్ కుమార్ గౌడ్, నిరంజన్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ కుమారి పీ. కృష్ణ కీర్తన, కోశాధికారి బాలాజీ బానోత్, ఇతరులు పాల్గొన్నారు.