కశ్మీర్‌లో ఇరానీ కప్
40 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్
ముంబై, ఆగస్టు 12: ప్రతిష్టాత్మకమైన దేశవాళీ క్రికెట్ మ్యాచ్ ఇరానీ కప్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరగబోతోంది. అక్టోబర్ 1 నుంచి 5 వరకు జమ్మూ కాశ్మీ ర్, రెస్ట్ ఆఫ్ ఇండియా జట్ల మధ్య ఇరానీ కప్ మ్యాచ్‌కు శ్రీనగర్లోని షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం ఆతిధ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికి.. జమ్మూ హెడ్ కోచ్ అజేయ్ శర్మ మాత్రం ధ్రువీకరించాడు.
ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ను ఘనంగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు అతడు తెలిపాడు. షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియంలో చేపట్టాల్సిన మౌలిక వసతుల అభివృద్ధిపై స్ధానిక క్రికెట్ అసోసియేషన్కు దిశానిర్దేశం చేసేందుకు బీసీసీఐ ప్రతినిధుల బృందం ఇప్పటికే రెండుసార్లు శ్రీనగర్‌లోపర్యటించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ స్టేడియం కెపాసిటీ 5,000గా ఉంది. కాగా షేర్-ఇ-కాశ్మీర్ స్టేడియం గతంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల కు కూడా ఆతిథ్యమిచ్చింది. ఈ మైదానంలో ఇప్పటివరకు రెండు వన్డే మ్యాచ్లు జరిగాయి. శ్రీనగర్ వేదికగా 1983లో భారత్-వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత చి వరగా 1986లో భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ను ఈ గ్రౌండ్‌లో నిర్వహించారు. అయితే జమ్మూ-కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తల కారణంగా చాన్నాళ్ల పాటు డొమాస్టిక్ మ్యాచ్లు సైతం నిర్వహించలేదు.






