1 July, 2026 | 7:40 PM

Breaking News

కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •   సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పి తనిఖీ   •   అమలు కానీ హామీలతో ప్రజల చెవిలో పూలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం   •   ఆర్టీసీ కార్గోను ప్రైవేటు పరం చేస్తే ఉద్యమమే: సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్   •   కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •  

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం

12-06-2024 02:22 AM

దళారీ వ్యవస్థ కనిపించవద్దు

ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ప్రజలకూ మేలు జరగాలి

గనుల శాఖతో సమీక్షలో ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): ర్యాంపు నుంచి వినియోగదారుడికి ఇసుక చేరే వరకు మధ్యలో మాఫియా అనేది కనపడొద్దని, దళారీ వ్యవస్థ లేకుండా ప్రణాళికలు రూపొందించుకోవాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఇసుకతోపాటు వివిధ తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ను రూపొందించి, వెంటనే టెండర్లకు పిలవాలన్నారు. మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో గనులశాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

గతంతో పోలిస్తే గణనీయంగా ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టుల మరమ్మతుల కోసం త్వరతగతిన ఇసుకను తరలించాల్సిన అవసరం ఉందన్న విషయం తన దృష్టికి వచ్చిందని భట్టి చెప్పారు. ఈ ప్రాజెక్టుల మరమ్మతుల విషయంలో ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని మైనింగ్ అధికారులను ఆదేశించారు. నదీ తీరాల్లో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉన్న రీచ్‌లు, టెండర్లు, ఆదాయానికి సంబంధించిన సమగ్ర నివేదికను సిద్ధం చేసుకోవాలని, ఈ విషయంలో సాగునీటి శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు.

రాష్ట్రంలో పలు గ్రానైట్ క్వారీలకు ఫైన్లు వేసి మూసేశారని, అవి ఎంత వసూలు చేశారు? ఆ క్వారీల పరిస్థితి ఏంటి? అని భట్టి ఆరా తీశారు. ఇసుక రీచ్‌లను ఆయా ప్రాంతాల్లో మహిళా సంఘాలకు కేటాయించడం, వ్యాపారం నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇవ్వడం, బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించడం వల్ల దళారులకు అడ్డుకట్ట వేసి, సర్కారు ఆదాయాన్ని పెంచవచ్చా? అనే అంశంపై సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను భట్టి ఆదేశించారు.

ప్రభుత్వ ఖజానాకు ఆదాయాన్ని సమకూరుస్తూనే ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడా మాఫియా కార్యకలాపాలు, ఖజానాకు నష్టం కలిగించే పనులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పట్టా భూముల పేరిట గోదావరి తీరం వెంబడి ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని, వీటిపై నిఘా పెట్టాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.