రెరాను పక్కాగా అమలు చేయాలి
సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): సొంతిల్లు కోసం ఎంతో కష్టపడుతున్న ప్రజలు రియల్ ఎస్టేట్ మోసాలతో బలవుతున్నారన్న సీఎం రేవంత్‌రెడ్డి.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ చట్టం వచ్చి ఏడేళ్లవుతున్నా ఇంకా అనేక మంది స్థిరాస్తి వ్యాపారుల చేతుల్లో ప్రజలు మోసపోతున్నారని మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి చిత్రా రామచంద్రన్‌తో సీఎం భేటీ అయ్యారు.
స్థిరాస్తి రంగంలో మరింత పారదర్శకత వచ్చేలా చూడాలని కోరారు. ఆస్తులను కొనుగోలు చేసే వారు మోసపోకుండా చూడాలన్నారు. రెరా చట్టం అమలు బాధ్యత రాష్ట్రాలదేనని, ఈ విషయంలో అప్పిలేట్ కమిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రెరా ఆదేశాలు కచ్చితంగా అమలు చేస్తే రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తృతంగా పెరుగుతుందని, అనేక మందికి ఉపాధి లభిస్తుందని సీఎం తెలిపారు. విశ్వసనీయమైన స్థిరాస్తి రంగంగా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఉండాలని కోరారు.






