16 June, 2026 | 10:55 AM

అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం

19-08-2024 12:00 AM

గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లోని అక్రమ నిర్మాణాలు కూల్చివేసిన హైడ్రా 

భారీ బందోబస్తుతో ఆదివారం ఉదయం నుంచి కూల్చివేతలు

పదెకరాల్లో అక్రమంగా వెలిసిన స్పోర్ట్స్ విలేజీ నేలమట్టం

రాజేంద్రనగర్, ఆగస్టు 18: చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా, విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతోంది. చెరువుల బఫర్ జోన్లు, నాలాలను ఆక్రమించిన ప్రాం తాలను గుర్తించి అక్కడ కట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు పడగొట్టేస్తున్నా రు. తాజాగా గండిపేట జలాశయంలోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలిసిన అక్రమ నిర్మా ణాలపై ఆదివారం ఉక్కుపాదం మోపారు.

ఉదయం నుంచి భారీ బందోబస్తు నడుమ జేసీబీల సాయం తో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను కూల్చివేశారు. అదేవిధంగా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ సమీపంలో కూల్చివేతలు నిర్వహిం చారు. ఓ భారీ భవనాన్ని సైతం పెద్ద హిటాచీ సాయంతో నేలమట్టం చేశారు. అక్రమ నిర్మాణాల వద్దకు కనీసం యజమానులు కూడా రాకపోవడం గమనార్హం.

సుమారు 15 భవనాలను సోమవారం నేలమట్టం చేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, గండిపేట జలాశయం పరిధిలో అక్రమ నిర్మాణాలపై యంత్రాంగం ఉక్కుపాదం మోపడం తో నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేశా రు. అయితే, స్థానికులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు. హైడ్రా అధికారులు ఇదే పంథా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గండిపేట జలాశయం చుట్టూ ఇంకా చాలా అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, వాటన్నింటిని కూల్చివేయాలని కోరుతున్నారు. 

స్పోర్ట్స్ విలేజీ.. 

గండిపేట జలాశయం ఎఫ్‌టీఎల్ పరిధిలో గతంలో ఓ వ్యక్తి ఓఆర్‌ఓ పేరుతో సుమారు పది ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ విలేజీ నిర్మించారు. తద్వారా నెలకు లక్షల రూపాయల సొమ్ము ఆర్జించారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో వెలిసిన నిర్మాణాలపై దృష్టిసారించిన హైడ్రా అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూల్చివేతలు చేపట్టారు. 

గండిపేట చెరువు పరిధిలో..

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు రెవెన్యూ పరిధిలోని గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్‌లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను ఆదివారం కూల్చివేశారు. హైడ్రాతో పాటు వాటర్ బోర్డు, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కూల్చివేతల్లో  నాలుగు భారీ భవనాలను నేలమట్టం చేయడంతో పాటు రెండెకరాల్లో ఉన్న క్రికెట్ గ్రౌండ్‌ను తొలగించారు. కూల్చివేతల నేపథ్యంలో ఉదయం నుంచే 20 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హైడ్రా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్, వాటర్ బోర్డు డీఈ నరహరి, ఏసీపీ కిషన్, మొయినాబాద్ సీఐ, ఎస్సై పాల్గొన్నారు.