వరి రైతులకు తీవ్ర నిరాశ
కనీస మద్దతు ధరపై అసంతృప్తి
మెదక్, ఆగస్టు 18(విజయక్రాంతి)ః ఇటీవల కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు వరి రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చాయి. వరిసాగుకు అయ్యే ఖర్చుకు తగినట్లుగా మద్దతు ధరను కేంద్రం పెంచకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మరలుతున్నారు. సాగు వ్యయం పెరిగి ఏటా నష్టాలే వస్తుండడంతో అన్నదాతలకు అండగా నిలబడడానికి 14 పంటలకు కనీస మద్దతు ధరలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కనీసం రూ.117 నుంచి రూ.632 వరకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
అయితే ఈ ధరల పెంపుపై జిల్లాలోని వరి రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలో వరి తర్వాత పత్తి అత్యధికంగా సాగవుతోంది. వరికి రూ. 117 పెంచడంతో సాధారణ వరి ధాన్యం ధర క్వింటాల్ రూ.2,300, ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2,320 పెరిగింది. జిల్లాలో పత్తి, కంది పంటలకు కాస్త ఊరటనిస్తుండగా వరి రైతులకు మాత్రం తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. వరి సాగుకు అయ్యే ఖర్చుకన్నా మద్దతు ధర తక్కువగానే ఉందంటూ రైతులు పెదవి విరుస్తున్నారు.
14 రకాల పంటలకు మద్దతు..
ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర పెంచింది. ఇందులో భాగంగా నువ్వులకు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.632, కనిష్టంగా వరికి రూ.117 మేర పెంచారు.
జిల్లాలో 85 శాతం వరి పంటే..
జిల్లాలో 2,80,949 మంది రైతులు ఉన్నారు. ఈ వానాకాలం సీజన్‌లో 3,73,509 ఎకరాల విస్తీర్ణంలో రైతులు సాగు చేసే అవకాశాలు ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఇందులో అత్యధికంగా వరిని 3,27,113 ఎకరాల్లో సాగు చేస్త్నున్నారు. పత్తి 40,619, మొక్కజొన్న 2,820, కందులు 1,125, పెసర్లు 1027, మినుములు 383, జొన్న 71, ఆముదం 14, సోయాబీన్ 76, చెరకు 109, ఇతర పంటలు 152 ఎకరాల్లో సాగు చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అయితే జిల్లాలో 85 శాతం వరి సాగవుతున్నందున కేంద్ర నిర్ణయం రైతులకు పెద్దగా ప్రయోజనం చేకూర్చేలా లేదని పలువురు అన్నారు.






