ఖాకీ వనంలో కన్నీటి గాథ!
హనుమకొండ, జూన్ 9 (విజయక్రాంతి) ః పేరుకు పోలీస్‌శాఖలో డ్యూటీ.. కానీ బతుకులు అడ్డా కూలీల కంటే హీనంగా తయా రయ్యాయని హోంగార్డులు ఆవేదన చెందుతున్నారు. ఏళ్లతరబడి వెట్టిచాకిరి చేయిం చుకుంటున్నారే తప్పా తమ జీ(వి)తాలు ఎదిగేలా లేవని వాపోతున్నారు. ప్ర భుత్వాలు.. అధికారులు మారినా తమ పరిస్థి తులు మారడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. పనిచేయించుకుని కూడా తగిన వేతనం ఇవ్వకపోగా, బందోబస్తు అలవెన్స్ లు కూడా ఇవ్వడం లేదని.. ప్రశ్నిస్తే విధుల నుంచి పక్కన బెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెట్టి బతుకులు?
తెలంగాణలో పోలీస్‌శాఖకు అనుసంధానంగా సుమారు 16 వేల మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్‌తో సమానంగా పనులు చేసే వీరికి జీతభత్యాల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పాలి. అంతేకాదు, ఉద్యోగ భద్రతా, వైద్య సౌకర్యాలు లేవు. పనిచేసిన రోజే వేతనం. లేదంటే కోత. ఎక్కువ మంది ట్రాఫిక్ విభాగంలో పనిచేయడం ద్వారా రోగాల బారిన పడుతున్న పలువురు వైద్యం చేయించుకోలేని దుర్భర స్థితిలో కొందరు మృత్యువాతపడుతున్నారు. అయినప్పటికీ పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదు. కానిస్టేబుళ్ల మాదిరిగానే తమకు కూడా ఆరోగ్య భద్రత కల్పించాలని గత ప్రభుత్వాలను వేడుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. 30 ఏళ్లకు పైగా విధులు నిర్వహించి రిటైరైనా, మరణించినా పోలీస్‌శాఖ నుంచి ఎలాంటి భరోసా లభించడం లేదని పేర్కొంటున్నారు. గతం లో ఎవరైనా హోంగార్డు మరణిస్తే ఆయా జిల్లాలకు చెందిన హోంగార్డులు ఒకరోజు వేతనాన్ని బాధిత కుటుంబానికి అందజేసేది. కానీ గత ప్రభుత్వంలో ఓ ఉన్నతాధి కారి ఆ సంప్రదాయానికి స్వస్తి పలకాలని ఆదేశించాడట. దీంతో ఆ కాస్తా ఆర్థిక సా యం కూడా ప్రస్తుతం అందకుండా పోతోందని బాధితులు ఆవేదన చెందుతున్నారు.
ఎన్నికల భత్తెం ఏదీ?
ఇటీవల సుమారు 2 వేల మంది హోంగార్డులు మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. అయితే ఆ రాష్ట్రాల్లో విధులు నిర్వ హించినందుకుగానూ అలవెన్స్‌లు ఇవ్వాల్సింది పోయి అక్కడ పనిచేసినన్ని రోజులకు వేతనంలో కోత విధించినట్లు బాధితులు వాపోతున్నారు. అక్కడి ప్రభుత్వాలు రోజుకు కేవలం రూ. 250 అలవెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుందని, ఎంతో కష్టనష్టాలకోర్చి రాష్ట్రం కానీ రాష్ట్రంలో పనిచేసి అనేక ఇబ్బందులు పడినట్లు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. అంతేగాకుండా ప్రతినెలా వేతనం ఆలస్యం అవుతుండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అయినా తమ సమస్యలపై దృష్టి సారించి ఉద్యోగ, ఆరోగ్య భద్రతతో పాటు జీవితాలకు భరోసా కల్పించాలని హోంగార్డులు వేడుకుంటున్నారు.
- ఏళ్లుగా వెట్టిచాకిరీ
- పని చేస్తేనే వేతనం
- జీత భత్యాల్లో కోత
- యూనిఫామ్ అలవెన్స్ రాక ఆరేళ్లు..
- ఎన్నికల విధుల భత్తెం కరువే
- ఉద్యోగ, ఆరోగ్య భద్రత నిల్
- ఆందోళనలో హోంగార్డులు
భరోసా లేని కొలువు?
హోంగార్డులకు గతంలో సబ్సిడీ క్యాంటీన్ల ద్వారా తక్కువ ధరకే సరుకులు కొనుగోలు చేసే వీలుండేది. కానీ ఇటీవల కేంద్రం ఆదేశాల మేరకు హోంగార్డులను సబ్సిడీ క్యాంటీన్లకు రానివ్వడం లేదని తెలుస్తోంది. ఫలితంగా మరింత ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టేసినట్లయిందని బాధిత హోంగార్డులు చెబుతున్నారు. గతంలో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని హోంగార్డులు ప్రభుత్వాలకు విన్న వించుకున్న ఘటనలున్నాయి. తమ పార్టీకి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని నాయకులు చెబుతున్నారే తప్పా అమలు చేయడం లేదని వాపోతున్నారు. హోంగార్డు విధుల్లో ఉం డగా చనిపోతే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత సైతం కల్పించాలని వేడుకుంటున్నారు.






