24 August, 2026 | 8:55 AM

రైతు రారాజే.. తరాజు కాడ నారాజే!

22-05-2024 12:25 AM

ధాన్యం కొనుగోళ్లలో తీరని అన్యాయం

కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జులదే పెత్తనం

సవాలక్ష కొర్రీలతో తూకంలో కోతలు

అన్నదాతల కష్టార్జితం అక్రమార్కులపాలు

చోద్యం చూస్తున్న అధికారులు

మంచిర్యాల, మే 21 (విజయక్రాంతి) : రైతు ఎప్పటికీ రారాజే. కానీ.. పంట ఉత్పత్తుల అమ్మకంలో నారాజ్ పడాల్సిన పరిస్థితులు మాత్రం తప్పడం లేదు. ఏ పంట వేసినా కొనుగోలు దారులో, అధికారులో, దళారులో చేతివాటంతో రైతులకు నష్టం కలిగించక మానడం లేదు. తాజాగా, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలను  కొందరు నిట్టనిలువునా దోచు కుంటున్నారు. రైతుకు వెన్నుదన్నుగా నిలబడమంటే.. దేశానికే వెన్నెముక అయిన వారికే తీరని అన్యాయం  చేస్తున్నారు. కొనుగోలు సెంటర్లలో ఇన్‌చార్జుల చేతివాటంతో అన్నదాతలు ఆర్థికంగా నష్ట పోతున్నారు.  తూకంలో మోసంతో రైతుల శ్రమను కాంటాల రూపంలో కాజేస్తున్నారు. ఇలాంటి సంఘటనలే  ఇటీవల మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని పలు పీఏసీఎస్ సెంటర్లలో వెలుగుచూశాయి. నిన్న మొన్నటి వరకు భీమారం మండల డీఆర్‌డీఏ పరిధిలోని కేంద్రాల్లో తాలు, తేమ పేరిట కోతలు విధించగా, వారి ఆదర్శంగా  నేడు చెన్నూర్ మండలంలో సైతం కొందరు పీఏసీఎస్ ఇన్‌చా ర్జులు దందాకు తెగబడ్డారు.  

కుంటిసాకులతో కోత.. 

జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జ్‌లే రైతులను నిట్టనిలువునా ముంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వీరు బస్తాకు 42 కిలోలకుపైనే తూకం వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా అధికారుల కనుసన్నుల్లోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, తూకమై న తర్వాత కూడా రైసుమిల్లులో సరుకు దిగుమతి సమయంలో మిల్లర్లు కోత పెడుతున్నారంటూ మరికొంత ధాన్యాన్ని దోచు కుంటున్నట్లు పలువురు రైతులు వాపోతున్నారు.  ఆ డబ్బులు తలా ఇంత పంచు కుంటున్నట్లు తెలుస్తోంది.

ధాన్యం అమ్మని రైతు పేరు రశీదులో..

చెన్నూర్ మండలం పొన్నారం పీఏసీఎస్ సెంటర్‌లో  చేకూర్తి తిరుపతిరెడ్డి, రామగిరి కృష్ణస్వామి, కస్తూరి మల్లయ్య వారి ధాన్యాన్ని తూకం వేయించారు. ఈ ముగ్గురి ధాన్యం బస్తాలను లారీ (ఏపీ 29వీ 4849)లో లోడ్ చేసి మిల్లుకు పంపించారు. ఇంతవరకు బాగానే ఉన్నా ట్రక్‌షీట్(5812) లో మాత్రం పైముగ్గురి పేర్లతోపాటు సెంటర్ ఇంఛార్జీ మానుగు భాష్కర్ పార్టనర్ దుర్గం రాజన్న పేరిట 53 బస్తాలు తూకం వేసినట్టుగా, లారీలో మొత్తం 608 బస్తాలు ఉన్నట్లు రాసి పంపించాడు. ఈ లోడ్ కాస్త మిల్లులో అన్‌లోడ్ అయిన తర్వాత నెట్ తూకం కేవలం 581 బస్తాలకే సరిపోవడంతో డమ్మీ రైతు(దుర్గం రాజన్న) పేరిట రాసిన 53 బస్తాలను కాస్తా 29గా మరో ట్రక్‌షీట్(5818) రాసిచ్చి రిసీవ్ తీసుకున్నాడు. అసలు విషయమేంటంటే ఆ లారీ లో దుర్గం రాజన్న వడ్లు పోలేదు కానీ పోయినట్లు సెంటర్ ఇంచార్జీ రాసి రైతుల డబ్బులను దండుకునే ప్రయత్నం చేశాడు. ఆ లారీలో 29 బస్తాల తూకం అంటే ఆ ముగ్గురు రైతుల నుంచి 12 క్వింటాళ్ల ధాన్యం అధికంగా తూకం వేసి రాజన్న పేరిట రాసి పంపించాడు. ఇదే మండలం దుబ్బపల్లిలో సైతం 42 కిలోలతో బస్తాలు తూకం వేసి మిల్లుకు పోయినంక లేనిపోని వంకలు పెడుతూ ఒక లారీకి ఎనిమిది క్వింటాళ్ల చొప్పున కట్ అయ్యిందని, రిసీవ్డ్ ట్రక్‌షీట్ ఇవ్వాలని రైతులు ఆందోళన చేయడంతో చేసేదేమి లేక సెంటర్ ఇంఛార్జీ మొత్తం డబ్బులు రైతులకు కట్టిస్తానని ఒప్పుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇలాంటివి సంఘటనలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు.

సాఫీగా సాగుతోందని అధికారుల చోద్యం..

క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సివిల్ సప్లయ్ ఉన్నతా ధికారిమాత్రం ధాన్యం కొనుగోల్లు సాఫీగా సాగుతున్నాయంటూ ప్రకటనలు చేస్తూ దొంగలకు కొమ్ముకాస్తున్నాడని బాహాటంగానే రైతులు పేర్కొంటున్నారు. ఇంత దారుణం ఎప్పుడు జరుగలేదని, 42 కిలోలు తూకం వేసినంక క్వింటాళ్ల కొద్ది కట్ చేస్తూ డమ్మీ రైతుల పేర్లు రాసి వారి అకౌంట్లలో వేసుకుంటున్నా చర్యలు తీసుకోక పోవడంలో అంతర్యమేమిటని ప్రశ్ని స్తున్నారు. ఫిర్యాదు చేస్తే నామ్ కే వాస్తేగా అధికారులు వచ్చి రైతుల స్టేట్‌మెంట్లు  తీసుకొని వెళ్లిపోయారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంపై పొన్నారం పీఏసీఎస్ సెంటర్ రైతులను విచారించిన డీసీఓ కార్యాలయ సూపరింటెండెంటు నరేష్‌ను ‘విజయక్రాంతి’ వివరణ కోరగా రైతులతోపాటు పీపీసీ ఇంఛార్జీను విచారించామని, నివేదికను ఉన్నతాదికారులకు సమర్పించామని, రెండు రోజుల్లో బాధ్యులపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దుబ్బపల్లి పీపీసీ సైతం సోమవారం సందర్శించి, నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు. సెంటర్ ఇన్‌చార్జిని తొలగించాలని ఆదేశించారు. 

8 క్వింటాళ్లు కట్ చేసిండ్రు

ఈనెల 14న బస్తాకు 42 కిలోలతో తూకం వేసి, రాత్రి 700 బస్తాలు నింపి లారీలో లోడ్ చేసిండ్రు. ఈ నెల 16న లారీకి ఎనిమిది క్వింటాళ్లు కోత విధించిండ్రని సెంటర్ ఇంఛార్జీ చెప్పడంతో ట్రక్ షీట్, కాంటా చిట్టీ ఇవ్వమని అడిగితే ఇవ్వడం లేదు. ఇలా మూడు బండ్లకు ఎనిమిది క్వింటాళ్ల చొప్పున కోత పెట్టిండు. ఎవరికైనా చెప్పుకో నాకేం కాదు అంటూ దబాయిస్తుండు. అధికారులే నాకు న్యాయం చేయాలి.

 - రైతు కిరణ్ రెడ్డి, దుబ్బపల్లి, చెన్నూర్ మండలం