24 August, 2026 | 7:52 AM

రైతులను కాంగ్రెస్ ముంచింది

22-05-2024 01:08 AM

దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలి

మాజీ మంత్రి హరీశ్ 

హైదరాబాద్, మే 21 (విజయక్రాంతి): కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రస్తుతం సన్నవడ్లకే మాత్రమే ఇస్తానని చెప్పడం ఆ పార్టీ మోసానికి పరాకాష్ట అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణలో యాసంగిలో దొడ్డు వడ్లు పండుతాయని, పండించిన సన్నవడ్లకు బోనస్ ఇస్తామనడం మోసం కాదంటూ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం రావుల చంద్రశేఖర్‌రెడ్డి, దేవిప్రసాద్, చింతా ప్రభాకర్‌తో కలిసి మాట్లాడుతూ వానకాలంలో 20 శాతం సన్నాలు, యాసంగిలో 99 శాతం దొడ్డు వడ్లు పండుతాయన్నారు.

నిరుద్యోగులకు రూ.4వేల భృతి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి, తరువాత ఆ హామీ ఇవ్వలేదని అసెంబ్లీ చెప్పారని, వడ్ల విషయంలో మాట తప్పారని మండిపడ్డారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో సన్నవడ్లకు అని ఎక్కడ చెప్పకుండా వరి ధాన్యానికి చెప్పారని, కానీ ఇప్పుడు పండించని వడ్లకు ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండించడంతో మనం హాయిగా తిండి తింటున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, రాహుల్‌గాంధీ, ప్రియాంక అందరూ వరి ధాన్యానికి బోనస్ చెప్పారని, 1.20 కోట్ల వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇవ్వాలంటే రూ.6 వేల కోట్లు కావాలని, సన్నాలకు మాత్రమే ఇస్తే రూ.500 కోట్లు సరిపోతాయని, రూ.4,500 కోట్లు ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల హామీలో జొన్న, మిరప, పసుపు, సోయాబీన్, ఎర్రజొన్న, ఇతర పంటలకు కూడా మద్దతు ఇవ్వాలని, వాటికి ఎప్పుడు ఇస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. వడ్ల బోనస్ విషయంలో ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా రైతాంగాన్ని ఏకం చేసి పోరాడుతామని హెచ్చరించారు. వానాకాలం నుంచి పంటలకు మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వడ్ల బోనస్‌పై క్యాబినెట్ నిర్ణయం ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలని, అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని, ఏ పంటలకు బోనస్ ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారో ఆ పంటలకు వానకాలం నుంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు బంధుకు కోతలు పెట్టకుండా తక్షణమే రూ.7,500 ఇవ్వాలని అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.25వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.