10 June, 2026 | 1:35 AM

సొంతింటి కలపై లంచాల గునపం!

10-06-2026 12:29 AM

ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు

ఒక్కో లబ్ధిదారుడి నుంచి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు 

అధికారులు, స్థానిక లీడర్ల దందా!

ములుగు మహిళ లేఖతో హైకోర్టు స్పందన

దందాపై సీబీఐ విచారణ ముంగిట సర్కార్

సంగారెడ్డి, జూన్ 9 (విజయక్రాంతి): ‘అక్రమాలకు తావులేదు. అర్హులందరికీ న్యాయం చేస్తాం. ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో ఎలాంటి రాజీ పడబోము. క్షేత్రస్థాయిలో ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతోంది. అక్కడక్కడా సాంకేతిక లోపాలు లేదా పొరపాట్లు జరిగి ఉంటే ఉన్నతాధికారుల బృందంతో ప్రత్యేక పునర్‌పరిశీలన జరిపిస్తాం.

లంచాలు అడిగినా, అర్హులను ఇబ్బంది పెట్టినా ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు, కఠిన చర్యలు తీసుకుంటాం’ అంటూ అటు ప్రభుత్వం, మంత్రులు, గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ప్రతిజ్ఞలాగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.

ఒక్కో లబ్ధిదారుడి నుంచి అధికారులు, స్థానిక లీడర్లు ఎంపిక, బేస్మెంట్ లెవెల్ బిల్లుల మంజూరు కోసం రూ.50 వేల నుండి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో ప్రవేశపెట్టిన ’ఇందిరమ్మ ఇండ్లు’ పథకం క్షేత్రస్థాయిలో తీవ్ర వివాదాలకు, అసంతృప్తికి వేదికగా మారుతోంది.

దరఖాస్తుల స్వీకరణ నుండి లబ్ధిదారుల తుది జాబితా రూపకల్పన, రుణాల మంజూరు వరకు ప్రతి దశలోనూ పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అర్హులైన నిరుపేదలు కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, రాజకీయ పలుకుబడి, పైరవీకారుల అండ ఉన్న అపాత్రులకు ఇండ్లు మంజూరవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. 

ఎంపికలో గందరగోళం

’ప్రజా పాలన’ కింద రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80 లక్షల దరఖాస్తులు రాగా, అందులో సగానికి పైగా (దాదాపు 53 శాతానికి పైగా) దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. మొదటి విడత కింద నిర్దేశించిన 4,50,000 ఇళ్ల లక్ష్యానికి గానూ, ఇప్పటివరకు 3,24,536 ఇళ్లు అధికారికంగా మంజూరైనట్లు అధికారవర్గాలు చెపుతున్నాయి.

గ్రామ సభల ద్వారా పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, స్థానిక అధికార పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీల సభ్యుల సిఫార్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పాత మట్టి ఇండ్లు, కూలిపోయే స్థితిలో ఉన్న గుడిసెలలో నివసిస్తున్న నిజమైన పేదలను పక్కనబెట్టి, కాంక్రీట్ బిల్డింగులు, సొంత వాహనాలు ఉన్నవారికి పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు ఉమ్మడి మహబూబాబాద్, ములుగు, సంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి.

అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,18,000 కంటే ఎక్కువ ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో పురోగతిలో ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లోనే ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం లబ్ధిదారులకు రూ.2,233.21 కోట్లు విడుదల చేసింది. బేస్మెంట్ స్థాయిలో 1,43,963 ఇళ్లు పూర్తి కాగా, వీరికి రూ.1,439.63 కోట్లు చెల్లించారు. రూఫ్ స్థాయిలో 46,206 ఇళ్లు పూర్తి కాగా, వీరికి రూ.462.06 కోట్లు విడుదలయ్యాయి.

స్లాబ్ పూర్తి చేసిన 16,576 ఇళ్లు తుది దశకు చేరగా, వీరికి రూ.331.52 కోట్లు బదిలీ చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అంతేగాకుండా ప్రత్యేకవర్గాల కేటాయింపులో భాగంగా అత్యంత వెనుకబడిన గిరిజన తెగ అయిన ’చెంచు’ లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా 13,266 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని నాగర్ కర్నూల్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు.

హైకోర్టు మెట్లెక్కిన లబ్ధిదారులు

ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో జరుగుతున్న భారీ అక్రమాలపై లబ్ధిదారులు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ములుగు జిల్లాకు చెందిన తిప్పల సాయి భవాని అనే వితంతు మహిళ హైకోర్టుకు లేఖ రాసింది. తీవ్రంగా పరిగణించిన హైకోర్టు, దీనిని సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా (పిల్) స్వీకరించి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ), రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

అర్హత లేని వారికి ఇండ్లను మంజూరు చేయడానికి కొంతమంది క్షేత్రస్థాయి అధికారులు, దళారులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు లంచాలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు గూడుకట్టుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ సాయంతో (పీఎంఏవై) ముడిపడి ఉన్న ఈ పథకంలో సుమారు 20 వేల మంది అనర్హులను కేంద్రం గుర్తించి తొలగించగా, రాష్ట్ర అధికారులు సైతం తప్పుడు మంజూరుగా గుర్తించిన 12,000 ఇండ్లను రద్దు చేయడం పథకంలో లోపాలను స్పష్టం చేస్తోంది. 

సాంకేతిక తప్పులు.. నిలిచిన బిల్లులు

అధికారుల నిర్లక్ష్యానికి, సాంకేతిక లోపాలకు పేదలు బలవుతున్నారు. ఒకే పేరున్న ఇద్దరు వ్యక్తులలో అనర్హుడికి బదులు అర్హురాలికి ఆర్డర్ కాపీ ఇచ్చి, ఆమె తన ఒంటిపై ఉన్న బంగారాన్ని కుదువబెట్టి బేస్మెంట్, గోడల నిర్మాణం పూర్తి చేసిన తర్వాత ‘పొరపాటున ఆర్డర్ ఇచ్చాం.. బిల్లులు రావు‘ అని అధికారులు చేతులెత్తేసిన ఘటనలు (ఉదాహరణకు బండ బాలమణి కేసు) కలకలం రేపుతున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఇండ్ల నిర్మాణాన్ని 60 చదరపు గజాలలోపే నిర్మించాలనే ఆంక్షలు పెట్టడం, పాత ఇండ్ల స్థలాల రీ-వెరిఫికేషన్లో జాప్యం లబ్ధిదారులకు నిద్రలేకుండా చేస్తోంది. ఈ బృహత్తర పథకం పక్కదారి పట్టకుండా ఉండాలంటే తక్షణ పరిపాలనా సంస్కరణలు అవసరం. 

రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల స్థితి

మొత్తం దరఖాస్తులు (ప్రజా పాలన) : సుమారు 80 లక్షలు

పరిశీలన అనంతరం తిరస్కరించినవి : 53 శాతానికి పైగా దరఖాస్తులు

తప్పుడు మంజూరుగా గుర్తించి రద్దు చేసినవి : 12,000 ఇండ్లు (రాష్ట్రవ్యాప్తంగా)

కేంద్రం (పీఎంఏవై) గుర్తించిన అనర్హుల తొలగింపు : 20,000 ఇండ్లు

మొదటి విడత కింద నిర్దేశించిన లక్ష్యం : 4,50,000 ఇండ్లు

ఇప్పటివరకు అధికారికంగా మంజూరైన ఇండ్లు : 3,24,536 

బేస్మెంట్ స్థాయిలో పూర్తయిన ఇండ్లు : 1,43,963 

రూఫ్ స్థాయిలో పూర్తయినవి : 46,206 ఇళ్లు 

స్లాబ్ పూర్తి చేసిన ఇండ్లు : 16,576 (తుది దశకు చేరినవి)