15 May, 2026 | 12:38 AM

అర్చక పోస్టుల భర్తీలో అవకతవకలు!

15-05-2026 12:00 AM
  1. సికింద్రాబాద్ మహంకాళి గుడిలో అర్చక ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్
  2. ఎంపికలో కీలక పాత్ర అధికారులదే

సికింద్రాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవా లయంలో అర్చక ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది. దేవాదాయ శాఖ మతపరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత సంవత్సరం నవంబర్‌లో దేవాలయంలో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల నియామకానికి కార్యనిర్వహణాధికారులు అప్పట్లో ప్రకటనలు ఇచ్చారు. సికింద్రాబాద్ మహంకాళి దేవాలయంలో ఆగమానుసారం అర్చక, పరిచారక పోస్టుల భర్తీలో నిబంధనలను పక్కనపెట్టి నియామకాలు చేపట్టారనే పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం అర్చక పోస్టుకు వేద పాఠశాల సర్టిఫికెట్, ఆగమ శాస్త్రంలో ప్రావీణ్యం, అనుభవం తప్పనిసరి. కానీ, ఇటీవల జరిగిన నియామకాల్లో అర్హతలు లేని వారికి పోస్టులు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. పోస్టులకు దరఖాస్తు చేసిన వారికి కనీసం కాల్ లెటర్ కూడా పంపలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కొందరు కమిషనర్‌ను కలుస్తామని హెచ్చరించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో ఓ ప్రముఖ అమ్మవారి ఆలయంలో అర్చక పోస్టుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని అభ్యర్థులు చర్చించుకుంటున్నారు.

అర్హులనే ఎంపిక చేయాలి : భక్తులు 

అర్హులకే అర్చకులుగా అవకాశం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. అయితే అమ్మవారి సేవకు శాస్త్రం తెలియాలి. కానీ ఇక్కడ అది చూడకుండా పైరవీలు చేసిన వాళ్లకే ఇచ్చారని ఆరోపణలొస్తున్నాయి. ఇది సం ప్రదాయానికి విరుద్ధమని కొందరు అంటున్నారు.. అర్హతల మినహాయింపు, వేద పాఠశాలలో చదవని వారిని, ఆగమం తెలియని వారిని అర్చకులుగా నియమించారనే ఆరోపిస్తున్నారు. సీనియారిటీ పక్కనపెట్టి, ఏళ్ల తరబడి సేవ చేస్తున్న తాత్కాలిక అర్చకులను కాదని, బయటి వ్యక్తులకు అవకాశం ఇచ్చారని, రాజకీయ ఒత్తిళ్లు,స్థానిక నాయకుల సిఫార్సులతో లిస్ట్ తయారైందని, పారదర్శకత లేదని విమర్శలు వస్తున్నాయి.

పరీక్షలు లేకుండానే, ఇంటర్వ్యూ పేరుతో మొక్కుబడిగా ప్రక్రియ పూర్తి చేసి, ముందే నిర్ణయి ంచిన వారికి పోస్టులు కట్టబెట్టారనే ఆరోపణలు వెలువత్తుతున్నాయి. ‘అమ్మవారి సేవ చేయాలంటే శాస్త్రం తెలియాలి. కానీ ఇక్కడ పైరవీలే ప్రా మాణికం అయ్యాయి’ అని సీనియర్ అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులు కూడా ‘పూజా క్రతువుల్లో తప్పులు దొర్లుతున్నాయి, సాంప్రదాయం దెబ్బతింటోంది” అని అంటున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు కోట్లాది మందికి ఇలవేల్పు అని, అలాంటి పుణ్యక్షేత్రంలో అర్చక నియామకాల్లో పారదర్శకత పాటించాలని, అర్హులకే అవకాశం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.

ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత: ఈవో మనోహర్‌రెడ్డి

ఆరోపణలపై మహంకాళి దేవాలయ ఈవో మనోహర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. ‘సికింద్రాబాద్ మహంకాళి దేవస్థానంలో వివిధ పోస్టులను భర్తీకి 50 మంది దరఖాస్తు చేశారు. వాటిలో అర్హత గల వారు 16 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఉన్న ఆరు పోస్టులపై ఒక పోస్ట్‌కి 19 మంది పోటీపడ్డారు. చండీ పారాయణ ఎంపిక కొరకు ఎక్స్పెక్ట్ ఐదుగురు సభ్యులు కమిటీ, అర్చక ఉద్యోగ ఎంపిక కొరకు నలుగురు కమిటీ సభ్యులు ఇంటర్వ్యూ నిర్వహించారు.

దీంట్లో అర్చక ఉద్యోగం కోసం ఒకరు, చండీ పారాయణ ఉద్యోగం కోసం ఒకరు చొప్పున ఎంపిక అయ్యారు. మిగతా పోస్టులకు అలాంటి ఎంపికను నిర్వహించలేదు’ అని ఈవో స్పష్టం చేశారు. కొందరు లేనిపోని ఆరోపణలు చేయడంతో ఎంపికను వాయిదా వేశామన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత పాటిస్తామని, ఎంపికలో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా చేస్తున్నామన్నారు. ఫిర్యాదులు, ఆరోపణలపై విచారణ చేస్తున్నారని, విచారణ కమిటీ నివేదిక తర్వాతనే అసలు వాస్తవాలు బయటకు రానున్నాయి అన్ని ఈవో మనోహర్‌రెడ్డి వెల్లడించారు.