09-01-2026 12:00:00 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు వినతి
గజ్వేల్, జనవరి 8: గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని వార్డుల, ఓటర్ల విభజనకు సంబంధించిన అంశంలో తీవ్ర అవకతవకలు నెలకొన్నాయని టెలికం బోర్డు సభ్యుడు కమ్మరి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని ఆధారాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ పరిధిలోని వార్డులలో నివసిస్తున్న ఓటర్లను ఆయా వార్డులకు కాకుండా మిగతా వార్డులలో బదిలీ చేయడం అంశంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తలెత్తుతుందన్నారు.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆయా వార్డులలో నివసిస్తున్న ఓటర్లను అదే వార్డులో ఓటరుగా గుర్తించి ఆమోదించాలని, తద్వారా ఎన్నుకోబడే ప్రజాప్రతినిధులకు ఆయా వార్డులలోని నివసిస్తున్న ప్రజలకు పరిపాలన సౌలభ్యం, సమస్యలపై ప్రశ్నించే అధికారం ఉంటుందని తెలిపామన్నారు.
ఈ మేరకు కమిషనర్ స్పందించి సిద్దిపేట జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు సమస్య పరిష్కారం కోసమై ఆదేశాలు ఇస్తామని హామీ ఇచ్చినట్లు కమ్మరి శ్రీనివాస్ తెలిపారు. సమస్య పరిష్కరించబడని పరిస్థితులలో అవసరమైతే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మునిసిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టడంతో పాటు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేసి ఓటర్లకు న్యాయం జరిగేంతవరకు న్యాయపోరాటం చేస్తామన్నారు.