calender_icon.png 10 September, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిభట్లలో అక్రమాల జోరు

10-09-2025 12:53:57 AM

  1. పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జా అనుమతులకు మించి కట్టడాలు

మున్సిపాలిటీ అధికారుల పర్యవేక్షణ కరువు

అక్రమ నిర్మాణాలు 150కి పైగానే..

ఒక్కో బిల్డింగ్ వద్ద రూ.3లక్షల నుంచి రూ.5లక్షల మేర వసూలు

కలెక్టర్, సీడీఎంఏ, డీటీసీపీ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకునేవారేరీ?

ఆందోళనలకు సిద్ధమవుతున్న  స్థానికులు

“ పార్కులు, ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. మరోవైపు అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతున్నా తమ జేబు నిండితే చాలు అన్నట్లు అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ జరిగే ప్రతి అక్రమాల్లో ముడుపులు అందడతో చర్యలకు జంకుతున్నారని, దీంతో రూ.కోట్ల విలువైన భూములు కబ్జా అవుతున్నా తమకేమీ ముఖం చాటేస్తున్నారు. ఇది ఎక్కడో కాదు  రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీలో జరుగుతున్న కబ్జాల తంతు.. వివరాల్లోకెళ్తే..

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 9: తిలా పాపం.. తలా పిడికెడు అన్న చందంగా మారి చాపకింద నీరులా సాతున్నవి ఆదిభట్ల మున్సిపాలిటీలో జరిగే అక్రమాలు. ఓ వైపు పార్కు స్థలాల కబ్జాలు అవుతుండగా, మరోవైపు అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల మున్సిపల్ పరిధి అంత:పురం కాలనీలోనీ పార్క్ స్థలంలో 2260 గజాల ఖాళీ స్థలం కొందరు వ్యక్తులు నకిలీ పత్రాలు సృష్టించి స్థలాన్ని కబ్జా చేసి, ప్రహరీ గోడను నిర్మించిన విషయం తెలిసిందే. దీనిపై కాలనీవాసులు జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు.

ఇది మరువక ముందే.. ఆదిబట్ల మున్సిపా లిటీ ఏర్పాటుకు ముందు 2017లో శ్రీమిత్ర ఎస్టేట్ ప్రైవేటు లిమిటెడ్ యాజమాన్యం 49.30 ఎకరాల్లో వెంచర్ చేయగా, నిబంధనల ప్రకారం అందులో 5 ఎకరాలు పార్కు స్థలానికి కేటాయించారు. ప్రస్తుతం మరియపురానికి దగ్గరలో వైపీఆర్ వెంచర్కు వెళ్లే దారిలో అక్రమార్కులు కబ్జా చేశారు. సుమారు 2,400 గజాలకు పైగా కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించారు. దీనిపై కలెక్టర్, సీడీఎంఏ, డీటీసీపీ కార్యాలయాల్లో స్థానికులు పలువురు ఫిర్యాదు చేశారు. అయితే టౌన్ ప్లానింగ్, మున్సిపల్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. 

మున్సిపాలిటీ ఆదాయానికి గండి..

ఆదిభట్ల మున్సిపాలిటీలోని మంగల్ పల్లి, ఆదిభట్ల పరిధిలో అనుమతులకు మించి అక్రమ నిర్మాణాలు సుమారుగా 150కి పైగా భవనాలు వెలిశాయి. మరిన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఈ అక్రమ నిర్మాణాలు నిర్మించే క్రమంలో ఒక్కో బిల్డింగ్ వద్ద రూ.3 నుంచి 5 లక్షల వరకు మున్సిపల్ అధికారులు వసూలు చేస్తున్నారని పలువురు నిర్మాణధారులు బహిరంగంగా చెబుతున్నారు. మరీ ఈ పైకమంతా అధికారులు సొంత జోబులోకి వేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా మున్సిపల్ ఆదాయానికి గండి కొడుతూ,  సొంత జోబులు నింపుకునే పనిలో పడ్డారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి.

అధికారి వింత సమాధానం..

టాక్స్ విషయానికి వస్తె.. తీసుకున్న అనుమతులకు అనుగుణంగా నిర్మించే భావనాల కంటే, అనుమతులకు మించి చేపట్టే అక్రమ నిర్మాణాలపై డబుల్ టాక్స్ వేస్తున్నామని, అంతేకాకుండా అట్టి పూర్తి వివరాలన్నీ మా కంప్యూటర్లో ఉన్నవి, వచ్చి చూసుకోండి అంటూ ఆదిభట్ల మున్సిపల్ అధికారి ఈ వింత సమాధానమివ్వడం సిగ్గుచేటు. ఈ సమాధానం ఇటీవల ఓ ఆర్టీఐ దరఖాస్తుదారుడు కోరగా మున్సిపల్ అధికారి ఈ వింత సమాధానమిచ్చారు.

అక్రమాలను ప్రోత్సహిస్తే ఖబడ్దార్

కొంగరకలాన్ సమీపంలోని శ్లోక కన్వెన్షన్ హాల్ పై ఇప్పటివరకు మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు. ఇది ఒక్కటే కాదు, మున్సిపాలిటీలో పార్కు స్థలాలు కాంతమవుతున్న మున్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మున్సిపాలిటీలో జరిగే అక్రమాలను కట్టడి చేయకుంటే బీఎస్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతాం.

- బంగారిగళ్ల మహేందర్, బీఎస్పీ నియోజకవర్గ కోశాధికారి