calender_icon.png 10 September, 2025 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

15,906 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్!

10-09-2025 12:51:13 AM

-విద్యుత్ వినియోగంలో సైతం భారీ పెరుగుదల

-దక్షిణ డిస్కమ్ పరిధిలోనూ గణనీయంగా పెరిగిన విద్యుత్తు డిమాండ్, వినియోగం 

-ఈ పరిధిలో 26 వేల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు: సీఎండీ ముషారఫ్

హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలు పెరగడంతోపాటు.. ఈ వానాకాలం పంటల సీజన్ కీలక దశకు చేరుకో వడంతో విద్యుత్ డిమాండ్, వినియోగం భారీగా పెరుగుతున్నాయి. గతేడాది సెప్టెంబర్ 20న రాష్ట్ర గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 15,570 మెగావాట్లుగా నమోదు కాగా, సోమవారం రాష్ట్రంలో 15,906 మెగావాట్ల అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదైంది.

తాజాగా కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నీటి లభ్యత పెరగడంతో.. పంటల సాగు కూడా అదే స్థాయిలో పెరిగింది. గతేడాది ఈ సీజన్‌తో పోలిస్తే విద్యుత్ వినియోగం సుమారు 50 శాతం మేర పెరగటం విశేషం. విద్యుత్ వినియోగం కూడా అదే స్థాయిలో నమోదైంది. సోమవారం రో జు రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు వినియోగం 296.65 మిలియన్ యూనిట్లుగా ఉంది. గతేడాది సెప్టెంబర్ 8 నాటితో (190.58 మిలియన్ యూనిట్లు) పోలిస్తే ఇది 55.65 శాతం అధికం కావడం గమనార్హం.

ఎస్‌పీడీసీఎల్ పరిధిలోనూ..

దక్షిణ డిస్కమ్ పరిధిలోనూ విద్యుత్తు డిమాండ్, వినియోగం భారీగా పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఒక్క దక్షిణ డిస్కమ్ పరిధిలోనే 2024 సెప్టెంబర్ 8న 133.14 మిలి యన్ యూనిట్లు వినియోగించగా.. సోమవారం నాడు (2025 సెప్టెంబర్ 8న) 203. 38 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరగింది. రాష్ట్రం మొత్తం వినియోగంతో పోలిస్తే.. దక్షిణ డిస్కమ్‌లో వినియోగం మూ డింట రెండు భాగాలు అన్న విషయం స్పష్టమవుతోంది. అలాగే గరిష్ఠ డిమాండ్ కూడా ఇదే స్థాయిలో పెరుగుతోంది. గతేడాది 6,457 మెగావాట్లు కాగా.. మొన్న సెప్టెంబర్ 8 నాడు 10,450 మెగావాట్లుగా నమోదైంది.

ఇది 61.84 శాతం పెరుగుదలతో సమానం. నిజానికి గతేడాది సెప్టెంబర్ 20 దక్షిణ డిస్కమ్ పరిధిలో అత్యధికంగా డిమాండ్ 9,910 మెగావాట్లుగా నమోదైంది. ఈ గరిష్ఠ డిమాండ్ రికార్డు ప్రస్తుతం 10,450 మెగావాట్లుగా ఉంది. దక్షిణ డిస్కమ్ పరిధిలో నల్లగొండ జిల్లాలో విద్యుత్ వినియోగం అత్యధికంగా పెరిగింది. గతేడాది సెప్టెంబర్ ఒకటిన అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 13.6 మిలియన్ యూ నిట్ల వినియోగం జరగ్గా.. ఈయేడు సెప్టెంబర్ ఒకటిన 148 శాతం పెరిగి 33.82 మిలి యన్ యూనిట్ల వినియోగం నమోదవ్వడం గమనార్హం.

పెరుగుతున్న విద్యుత్ డిమాండ్, వినియోగం నేపథ్యంలో దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మంగళవారం డైరెక్టర్లు, సీఈలు, ఎస్‌ఈలతో పరిస్థితిని సమీక్షించారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలతోపాటు, పంటల కాలం కావడంతో అత్యధిక డిమాండ్, వినియోగం నమోదవుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ అధికా రులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. సరఫరాలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు.

దక్షిణ డిస్కమ్ (ఎస్‌పీడీసీఎల్) పరిధిలో 26 వేల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం డిస్కమ్ పరిధిలో ఉన్న 4.92 లక్షల డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లలో ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే మార్చేందుకు వీలుగా ప్రతి సర్కిల్‌లో సరిపోయినన్ని డీటీఆర్‌లు రోలింగ్ స్టాక్‌గా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. విద్యుత్ అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు నరసింహులు, శివాజీ, కృష్ణారెడ్డి, సీఈలు, ఎస్ ఈలు పాల్గొన్నారు.