16-07-2025 12:29:29 AM
సిద్దిపేట, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయ గణితాన్ని మార్చేలా గజ్వేల్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన పరిధిని చాపకింద నీరులా విస్తరిస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలలో అసంతృప్తిగా ఉన్న నేతలు వరుసగా బీజేపీలో చేరుతుండటం, స్థానిక రాజకీయాలపై ప్రభావం చూపుతోంది. ఇటీవల మునిసిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్, సంతోషి రామచంద్రచారి, రామదాసులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
గజ్వేల్ ప్రజ్ఞాపూర్లో భారీ ర్యాలీ నిర్వహించి హైదరాబాదులో బీజేపీ పార్టీ అధినాయకత్వం సమక్షంలో బీజేపీలో చేరిన ఈ నేతలు, గజ్వేల్లో కాషాయ పార్టీకి ఊపును తీసుకురావచ్చన్న భావన రాజకీయ వర్గాల్లో విస్తృతంగా వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ స్థానిక బీసీ వర్గాలను, తన రాజకీయ మిత్రులను సమీకరిస్తూ రాజకీయంగా నూతన ఆకర్షణగా నిలుస్తున్నారు.
గజ్వేల్ మండలంలోని కొలుగూరు గ్రామం మాజీ సర్పంచ్ మల్లపూ రాజు సతీమణి గతంలో టిడిపి అభ్యర్థిగా జెడ్పిటిసి కి పోటీ చేసింది ఆమె నేడు, రేపు బిజెపిలో చేరుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం.
పార్టీల్లో అసంతృప్తి..బీజేపీకి బలమా?
కాంగ్రెస్ పార్టీ అంతర్గత క్షోభతో నేతల వలసలు ఊపందుకున్నాయి. జిల్లా కాంగ్రెస్ పార్టీలో కీలకంగా భావించబడుతున్న నేత భాస్కర్ పార్టీకి రాజీనామా చేయడం పార్టీకి నష్టం చేసిందన్న చర్చ జరుగుతున్నా, ఆయన గతంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మారాడని ప్రజల్లో కలిగే నమ్మకంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బలమైన లెక్కలేనా..?
గజ్వేల్ ఎమ్మెల్యేగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తన జెండా ఎగురవేయాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ముంపు ప్రాంతాల్లోని మాజీ సర్పంచ్లు, మాజీ ప్రజా ప్రతినిధులు బిఆర్‌ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.
బిఆర్‌ఎస్ నేతలు వీరిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నా, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలు ముంపు గ్రామాలకు ప్రయోజనం చేయలేవన్న నినాదంతో నేతలు బీజేపీ వైపు వెళ్లడాన్ని న్యాయబద్ధం చేసుకుంటున్నారు.
సరైన నాయకత్వం... సరైన సమయం...?
భాజపా వర్గాల అభిప్రాయం ప్రకారం, గజ్వేల్లో పదవులను పొందే అవకాశాలు ఇతర పార్టీల కంటే బీజేపీలో అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అనేక మంది నేతలు పార్టీ మారుతున్నట్లు తెలుస్తోంది. భాస్కర్ పార్టీ మారిన కారణం కూడా ఇదేనన్న ప్రచారం ఉంది. రాజకీయంగా బలపడేందుకు బీజేపీ ఈ వలసలను వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటోందన్నది స్పష్టమవుతోంది.
మొత్తం మీద గజ్వేల్లో బీజేపీ పార్టీ ఒక దిశగా ప్రణాళికాబద్ధంగా వ్యూహం అమలు చేస్తూ, అసంతృప్తులకు ఆశ్రయం కల్పిస్తూ పావులు కదుపుతోంది. ఈ పరిణామాలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ఎంతవరకూ ముప్పుగా మారతాయో వేచి చూడాలి.