02-08-2025 01:55:06 AM
కామారెడ్డి, ఆగస్టు 1, (విజయ క్రాంతి): జననం ఒక ఇంట్లో, ధ్రువీకరణ పత్రం మాత్రం మరో ఇంటికా? కామారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఇదే ప్రశ్న ప్రజలను కలవరపెడుతోంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్లో ప్రసవించిన పాప కోసం ఆమె తల్లి ఎదురు చూస్తున్నా, అధికారుల చేతుల్లో మాత్రం ఆ పాపకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మరొకరి పేరుపై జారీ చేయడం కలకలం రేపుతోంది.
కామారెడ్డి మున్సిపల్ అధికారులు, సిబ్బంది కుమ్మక్కై జనన ధ్రువీకరణ పత్రం కోసం 2 వేల నుంచి పదివేల వరకు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ధ్రువీకరణ పత్రాల్లో ఘోర తప్పిదాలు:
మున్సిపల్ కంప్యూటర్ ఆపరేటర్లు, మీసేవ నిర్వాహకులు, ఆసుపత్రి డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఒకే దారిలో ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నారు. ఆధారాలు లేకుండానే పేరు మార్పులు, సరైన పత్రాలు లేకుండా ధ్రువీకరణలు, బినామీ పేర్లతో పత్రాల జారీ చేస్తున్నారు.
లక్షల్లో వ్యాపారం:
ప్రతిరోజూ డెలివరీలుగా ఆసుపత్రిలో కనీసం 1020 జననాలు జరగగా, వాటిపై అక్రమ రీతిలో ధ్రువీకరణ పత్రాల కోసం వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఒక పత్రానికి కనీసం 2,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నట్లు స్థానికులు చెప్తున్నారు.
పాప ఎక్కడ..?
మార్చి 17న కామారెడ్డి జిజిహెచ్లో పుట్టిన పాప మరుసటి రోజు నుంచే కనిపించకపోవడంపై ఆ పాప తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. తల్లి ఒంటరిగా తిరుగుతుండడం, పాప ఎక్కడ ఉందన్న ప్రశ్నకు సమాధానం లేకపోవడం, ఇది కేవలం అవకతవక కాదని, పాపను అమ్ముకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆస్పత్రి లో పనిచేసే కొంతమంది సిబ్బందితో చేతులు కలిపి పాపను అమ్మారనే ఆరోపణలు వస్తున్నాయి. లోతైన విచారణ చేస్తే పాప అదృశ్యం తల్లిదండ్రులకు తెలిసి జరిగిందా లేక ఆసుపత్రి సిబ్బంది చేతివాటం ప్రదర్శించారా అనే విషయాలు వెలుగులోకి రానున్నాయి.
ఫిర్యాదు రాకపోతే ఏం చేయగలం? అంటూ చేతులెత్తేస్తున్న అధికారులు
పాప అదృశ్యం పై అధికారులు వివరణ కోరగా తమకు ఫిర్యాదు రాలేదని, తాము ఏమి చేయలేమని చెప్పడం ప్రజల నమ్మకాన్ని అధికారులు చూరగొనలేకపోతున్నారు. ఈ విషయాలు తెలిసిన సంబంధిత జిల్లా అధికారులు మాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు రానిదే చర్యలు తీసుకోలెమని సంబంధిత అధికారులు అంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
జనన ధ్రువీకరణ పత్రాల జారీలో అవకతవకలు
కామారెడ్డి బల్దియాలో జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉంది. ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రిలో డెలివరీ అయిన శిశువుల వివరాలను సంబంధిత ఆస్పత్రి ఇబ్బంది మున్సిపల్ లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ ఎంట్రీ చేయడంలోనే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. 2000 నుంచి పదివేల వరకు జనన ధ్రువీకరణ పత్రం కోసం డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని విచారణ చేస్తామని చెప్పారు. తప్పు చేస్తే శాఖపరమైన శిక్ష ఉంటుందన్నారు.
పాపా అదృశ్యం సంఘటన తమ దృష్టికి రాలేదు
కామారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో పాప అదృశ్యం పై ఆసుపత్రి సూపర్డెంట్ పెరుగు వెంకటేష్ విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరగా తమ దృష్టికి రాలేదని తెలిపారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ఘటన జరగలేదని, ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగి ఉండొచ్చు అని అన్నారు. విచారణ చేపడతామని తెలిపారు.
పెరుగు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, కామారెడ్డి