calender_icon.png 2 August, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం చేతికి కాళేశ్వరం నివేదిక

02-08-2025 02:03:18 AM

  1. రేవంత్‌రెడ్డికి అందించిన మంత్రి ఉత్తమ్
  2. అధ్యయనానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు
  3. సభ్యులుగా ఇరిగేషన్, న్యాయ, జీఏడీ శాఖల సెక్రటరీలు
  4.    4న క్యాబినెట్ ముందుకు నివేదిక, చర్చ

హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో సీఎం రేవంత్‌రెడ్డికి అధికారులు అందించారు. నీటి పారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. నీటి పారుదల శాఖ సెక్రటరీ, న్యాయ శాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీలను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీ ఈ నెల 4వ తేదీన నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించనున్నది. 

నివేదిక కోసమే 4న కేబినెట్...

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 20 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగాయి. అయితే ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణపై ఎప్పటికప్పుడు నిర్వహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటీవల జూలై 28వ తేదీనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. నెలకు రెండు సార్ల చొప్పున అయితే వాస్తవానికి ఆగస్టు రెండో వారంలో కేబినెట్ సమావేశం జరిగాలి.

కానీ కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో ఆగస్టు 4వ తేదీనే అత్యవసరంగా కేబినెట్ నిర్వహించనున్నారు. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి కేబినెట్ భేటీ కావడంతో కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరగా నివేదికను బహిర్గతం చేసి దోషులను బయటపెట్టనున్నట్టు సమాచారం.

కమిషన్ నివేదిక మేరకు కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగినట్టు ప్రత్యేక కమిటీ సిఫారసు చేస్తే వెంటనే చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 4వ తేదీన కాళేశ్వరం కమిషన్ నివేదికపై కేబినెట్‌లో చర్చించి అనంతరం అసెంబ్లీ సమావేశాల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నది. 

ప్రభుత్వ చర్యలు వేగవంతం 

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అందించిన వెనువెంటనే ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. దీంతో కమిషన్ నివేదికలో ఏముందోనని అందరిలోనూ ఆసక్తి రేకిస్తోంది. కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు పలువురు కారణమని నివేదికలో స్పష్టం చేసినట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్మాణ పనులు జరిగాయని, ఉన్నతస్థాయిలో వచ్చిన ఒత్తిడులకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని నివేదికలో పొందుపర్చారని వాదనలు వినిపిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఆర్థిక అవకతవకలు జరిగాయని, బరాజ్‌ల నిర్మాణంలో లోపాలున్నాయని కమిషన్ నివేదికలో స్పష్టం చేసినందునే ప్రభుత్వం వెంటనే కమిటీని ఏర్పాటు అధ్యయనం చేయాలని సూచించినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే కేబినెట్ సమావేశంలో తీసుకునే నిర్ణయంపై, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి బాధ్యులను బహిర్గతం చేసే యోచనలో ప్రభుత్వం ఉండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.