1 August, 2026 | 1:05 AM

గ్రంథాలయమే ఇల్లయిన ‘ఎమ్మెల్’

01-08-2026 12:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

కొన్ని సంస్థలు సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవడానికే ఆవిర్భవిస్తాయి. అలాగే కొంతమంది వ్యక్తులు ప్రజాసేవలో పునీతులు కావడానికే జన్మిస్తారు. ‘శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం’ 125 సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని రాంకోఠిలో స్థాపితమైంది. ఇది నిజాం రాష్ట్రంలోని మొట్టమొదటి గ్రంథాలయం. పాఠకలోకానికి దేవాలయం. ఈ గ్రంథాలయాన్ని గ్రంథాలయోద్యమానికి, జాతీయోద్యమానికి ఆలంబనగా నడిపిన మహానుభావులెందరో ఉన్నారు.

రావిచెట్టు రంగారావు దీని వ్యవస్థాపకులు కాగా, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆచిరాజు వీరభద్రారావు, ఖండవల్లి లక్ష్మీరంజనం, బిరుదురాజు రామరాజు వంటి పెద్దలు సారథ్యం వహించారు. ఈ వరుసలో ఎం.ఎల్.నరసింహారావు గారి గురించి చెప్పుకోక తప్పదు. వీరు ఎమ్మెల్ గా సుప్రసిద్ధులు. భాషా నిలయానికి 1965 నుంచి 2015 వరకు సుమారు యాభై ఏళ్లు కార్యదర్శిగా ఉండి చేసిన సేవలు నిరుపమానమైనవి. ఎమ్మెల్ పండితాపురం (ఖమ్మం జిల్లా)లో 1929లో జన్మించారు.

విద్యార్థి దశలోనే స్వాతంత్య్రోద్యమానికి ప్రభావితుడై పాఠశాలను విడిచి ప్రజా పోరాటంలో పాల్గొన్నారు. హైస్కూల్‌లో తనకు సీనియర్ విద్యార్థులైన హీరాలాల్ మోర్యా, దాశరథీ కృష్ణమాచార్యులతో కలిసి గ్రామాల్లో జాతీయోద్యమ ప్రచారంలో పాల్గొన్నారు. గాంధీజీ ప్రత్యేక రైలు 1946 ఫిబ్రవరి 5న ఖమ్మంలో ఆగినప్పుడు వాలంటీర్లుగా ఎన్నికైన వారిలో ఎమ్మెల్ కూడా ఒకరు. జమలాపురం కేశవరావు, కోదాటి నారాయణరావు గార్ల సూచనల మేరకు ఖద్దరు వస్త్రాలు ధరించడం అప్పుడే మొదలై, జీవితాంతం కొనసాగింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ చదువుతున్నప్పుడే తెలుగు భాషా సంఘానికి ఉపాధ్యక్షులుగా ఎమ్మెల్ ఎన్నికయ్యారు. దేశభక్తి, స్వదేశీ వేషభాషాభిమానం, నిరాడంబరత, త్యాగనిరతి, మానవతా దృక్పథం మొదలైన భావాలను అలవర్చుకున్న ఎమ్మెల్ గారు 1968లో ‘గాంధీ శాంతి ప్రతిష్ఠాన్ కేంద్రం’ కార్యదర్శిగా కొంతకాలం పనిచేశారు. ‘కాకతీయ విజ్ఞాన సమితి’, ‘స్వాతంత్య్ర సమరయోధుల సంఘం’, ‘సర్వోదయ సహాయ సంఘం’, ‘భారత్ సేవక్ సమాఖ్య’, ‘భారతీయ సాహిత్య పరిషత్’ మొదలైన సంస్థల్లో భాగస్వాములై తమ సేవా దృక్పథాన్ని నిరూపించారు.

రచయితగా, అనువాదకునిగా, సాహిత్య విమర్శకునిగా, సంస్థల నిర్వహణాదక్షునిగా పేరొందిన ఎమ్మెల్ రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల గురించి సుమారు 150 రచనలు చేశారు. ప్రముఖుల జీవిత చరిత్రల రచయితగా గుర్తించి వీరిని అప్పటి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సన్మానించింది. తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఎమ్మెల్ రచించిన జీవిత చరిత్రలు ప్రసిద్ధమైనవి. వీరు షిరిడీ సాయిబాబా, మహాత్మాగాంధీ, వినోబాభావే, మొరార్జీ దేశాయ్, జయప్రకాశ్ నారాయణ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇందిరాగాంధీ, పి.వి.నరసింహారావు మొదలైన వారి గురించి సమగ్రమైన జీవిత చరిత్రలను అందించారు.

అలాగే బూర్గుల రామకృష్ణారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, తెన్నేటి విశ్వనాథం, కె.వి.రంగారెడ్డి, ఈశ్వరీబాయి, జమలాపురం కేశవరావు, కొత్తూరి సీతయ్యగుప్త, స్వామి రామానంద తీర్థ, పండిత నరేంద్రజీ వంటి మహనీయుల జీవిత చరిత్రలను ఏకధాటిగా రచించారు. నూరుమంది తెలుగు ప్రముఖుల గురించి ‘తెలంగాణ వైతాళికులు’ పేరుతో ఒక ఉద్గ్రంథమే రచించారు. ఇంకా ‘తరతరాల తెలుగు ప్రముఖులు’ పేరుతో వీరు రచించిన గ్రంథానికి ఎంతో కీర్తి లభించింది.

ఎంతో మంది ప్రముఖుల జీవిత చరిత్రలను రచించిన ఎమ్మెల్ తన జీవిత చరిత్రను మాత్రం రాసుకోలేదు. అయితే, 2000వ సంవత్సరంలో వెలువడిన వారి ‘సామాజిక సేవా స్వర్ణోత్సవ సంచిక’ ఎమ్మెల్ గారి ఉజ్వలమైన జీవనయాత్రకు అద్దం పడుతుంది. నిర్మలమైన హృదయం, ఎవరినీ నొప్పించని వాక్కు, పరిచితులను అపరిచితులను పలకరించే తీరు ఎమ్మెల్‌ను ఒక విశిష్టమైన వ్యక్తిగా నిలిపింది.

కాకతీయ విశ్వవిద్యాలయంలో తనకు లెక్చరర్‌గా చేరడానికి అవకాశం ఉన్నప్పటికీ, దాన్ని వదిలిపెట్టి గ్రంథాలయోద్యంలో పాల్గొని శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేసిన ఎమ్మెల్ స్వతంత్ర భావాలు కలిగిన వ్యక్తి. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రాకముందు ప్రగతి మహా విద్యాలయంలో లెక్చరర్‌గా పని చేశాను. ఈ కళాశాల శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయానికి సమీపంలో ఉన్నది.

ఆ కళాశాలలో ఎమ్మెల్ గారి రెండవ కుమారుడు శ్రీకాంత్ నాకు విద్యార్థి. అందువల్ల బహుగ్రంథకర్తగా, సౌజన్యశీలిగా పేరుగాంచిన ఎమ్మెల్ గారు నాకు మరింత సన్నిహితులయ్యారు. తరచుగా నేను వారి గ్రంథాలయానికి వెళ్లేవాణ్ని. నాకు కావాల్సిన పుస్తకాన్ని అందించాలని గ్రంథాలయం సిబ్బందికి వారు చెప్పి ఉంటారు కనుక, నాకెప్పుడు పోయినా ఇబ్బంది కలిగేది కాదు.

1971 నుంచి నేటి దాకా నాకు వారి గ్రంథాలయంతో సంబంధం ఉంది. నేను పిహెచ్.డి. పరిశోధనాంశంగా ‘ప్రాచీన కావ్యాలు గ్రామీణ జీవన చిత్రణ’ అనే అంశాన్ని తీసుకున్నప్పుడు, నాకు కావాల్సిన ప్రాచీన కావ్యాలన్నీ భాషానిలయం నుంచి మాత్రమే లభించాయి. ఒక్కోసారి నాకు ఇంటికి కూడా పుస్తకాలిచ్చే వారంటే అదంతా ఎమ్మెల్ గారి సౌజన్యమే.

భాషానిలయం కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎమ్మెల్ గారికి గ్రంథాలయమే ఇల్లయ్యింది. వారు జీవించి ఉండగానే శిథిలమైన గ్రంథాలయం ఒక అధునాతన భవనంగా నిర్మితమైంది, సాహిత్యానికి, సంస్కృతికి కేంద్రమైంది. మనిషి జీవితం నూరేళ్లనుకుంటే, అందులో యాభై ఏళ్లు ఎవరూ ఉద్యోగం కూడా చేయరు. కానీ, పుస్తక ప్రేమికులుగా, సేవాపరాయణులుగా, విద్యావేత్తగా, పరోపకారిగా తన జీవితాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన మహానుభావుడు ఎమ్మెల్.

పెద్దలతో, పిన్నలతో కలిసిమెలిసిపోయే స్వభావం వీరిది. మాజీ ప్రధాని పి.వి నరసింహారావు వంటి పెద్దలతో కలిసిమెలిసి తిరిగిన ఎమ్మెల్ ఎన్నడూ, ఎక్కడా గర్వం చూపి ఎరుగరు. ఆయన సేవాదృష్టిని కొనసాగిస్తూ భాషానిలయం ఒక మహోన్నత సంస్థగా విరాజిల్లుతున్నది. ప్రస్తుతం కె.వి రమణాచార్యులు అధ్యక్షులుగా, ఉడయవర్లు కార్యదర్శిగా ఉన్న భాషానిలయం దేశంలోని అన్ని సాహిత్య సంస్థలకు ఆదర్శంగా నిలబడింది.

 వ్యాసకర్త సెల్: 9885654381