10-12-2025 01:52:40 AM
షాద్ నగర్, డిసెంబర్ 9 (విజయక్రాంతి ): స్థానిక పోరు పార్టీ నేతల మధ్య పంచాయతీ పెట్టింది. అధికార పార్టీలో పరిస్థితి ఉందంటే అనుకోవచ్చు.. ప్రతిపక్ష పార్టీలో ను సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఐదేళ్లకొకసారి వచ్చే స్థానికపోరు లో సర్పంచ్ పదవిపై అందరికీ కళ్ళు ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు పదవి దక్కించుకోవాలని ఎత్తు గడలు వేస్తారు. ఓకే పార్టీలో అదే పదవీ కోసం ఇద్దరి నేతలు ఎన్నికల బరిలో నిలబడితే ఆయా పార్టీ నేతలు,కార్యకర్తలు ఎవరి కి మద్దత్తు ఇవ్వాలో తెలియక అయోమయంలో పడ్డారు.
జిల్లాలో ఇప్పు్పడు అధికార, ప్రతిపక్షంలో ఇదే సీన్ కనిపిస్తుంది. ఒక పార్టీలో ఒకరే పోటీలో ఉంటే గెలుపు కోసం ఎంతైనా ప్రయత్నించవచ్చు.. దాని అదే పార్టీ నుంచి ఒకే పదవికి ఇద్దరు పోటీ పడుతుంటే అది అగ్రనేతలకు తలనొప్పి వ్యవహారంగా మారక తప్పదు..నామినేషన్ల సమయంలో దీనిని సీరియస్ గా తీసుకోని అగ్రనేతలు ఇప్పుడు అయోమయంలో పడ్డారు.
ఎవరి వైపు ప్రచారం చేయాలో అర్థం కాక అలాంటి గ్రామాలకు వెళ్లడమే మానేశారు..మిగతా గ్రామాలపై దృష్టి పెట్టారు..షాద్ నగర్ నియోజకవర్గంలో తలనొప్పిగా మారిన ఈ వ్యవహారం ఇరు పార్టీలకు నష్టం తెస్తుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఫరుక్ నగర్, కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరి గూడ మండలాలలో 153 గ్రామ పంచాయతీలు ఉండగా 1070 వార్డులు ఉన్నాయి.
తలలు పట్టుకుంటున్న నేతలు..
సాధారణంగా రెండు పార్టీల మధ్య నువ్వా, నేనా అన్న రీతిలో పోటీ జరగడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ఒకే పార్టీ నుంచి ఇద్దరు వ్యక్తులు నువ్వా, నేనా అన్న రీతిలో పోటీ పడడం ఇక్కడ విచిత్రంగా అనిపించే అంశం. అసెంబ్లీ సమయంలో పార్టీలకు సేవలు అందించిన నాయకులు సర్పంచ్ పదవులపై ఆశ పెట్టుకున్నారు. ఇలాంటి వాళ్లు గ్రామానికి 10 మంది చొప్పున ఉన్నారు. కానీ, రిజర్వేషన్ల పుణ్యమా అని కొందరు పోటీకి అవకాశం లేకపోగా మరికొందరి పార్టీ నేతలను అయోమయం చేస్తుంది.
ఆయా పార్టీ పదవులో ఉన్న వారు ఇద్దరూ నుంచి నలుగురు దాకా నామినేషన్లు వేశారు.అతి కష్టం మీద ఒకరిద్దరూ తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోగా చాలాచోట్ల ఇద్దరు పోటీ చేస్తుండడం పార్టీకి తలనొప్పిగా మారింది. ఉదాహరణకు ఎలికట్ట గ్రామాన్ని తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఇద్దరు, టిఆర్‌ఎస్ నుంచి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఇది పార్టీలకు తలనొప్పిగా మారింది. ఇలా ఉంటే కొన్నిచోట్ల కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ పడుతుండగా బీఆర్‌ఎస్ నుంచి ఒక్కరే పోటీపడుతున్నారు.
ఇది కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చే అంశం కాగా మరికొన్నిచోట్ల కాంగ్రెస్ నుంచి ఒక్కరే పోటీలో ఉండగా బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు రంగంలో ఉన్నారు. ఇది ఆ పార్టీకి నష్టం చేకూరుస్తున్న అంశం.గ్రామీణ ప్రాంతాలలో బలంగా ఉన్నవి ఈ రెండు పార్టీలే.. సర్పంచ్, వార్డు పదవుల కోసం ఇద్దరు చొప్పున పోటీ ఉండడం నేతలకు మింగుడు పడనిదిగా మారింది. ప్రచారం లో తమకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతల వద్దకు వచ్చిన అభ్యర్థులకు ప్రజాబలం ఉన్న వారే గెలుస్తారంటూ పరోక్షంగా వారిని తిప్పి పంపుతున్నారు.