11 April, 2026 | 9:12 PM

తూప్రాన్‌లో సఫాయి కార్మికుల నిరసన

11-04-2026 07:33 PM

వేసవి కాలంలో పని సమయాన్ని సడలించాలని వినతి

టార్గెట్ పూర్తి చేస్తామంటూ హామీ

తూప్రాన్,(విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో పనివేళలు సడలించాలని తూప్రాన్ మున్సిపల్ సఫాయి కార్మికులు అధికారులను బాధతో కోరుతున్నారు. పనిభారం ఎంత ఉన్నా టార్గెట్‌ను పూర్తిచేస్తామని, అయితే ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విధులు నిర్వహించేందుకు అనుమతించాలని వినతిపత్రం సమర్పించారు. కార్మికుల వివరాల ప్రకారం, ఇటీవల ఎండల కారణంగా ఆరోగ్య సమస్యలు తీవ్రంగా పెరుగుతున్నాయి.

నిన్న రావెల్లి ప్రాంతానికి చెందిన కార్మికుడు పద్మారావు విధుల మధ్యలోనే సొమ్మసిల్లి పడిపోగా, మరొక రోజు తూప్రాన్‌కు చెందిన మహిళా కార్మికురాలు బైక్‌పై వెళ్తూ చక్కర్ తో కిందపడిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలు కార్మికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక నర్సాపూర్, రామాయంపేట మున్సిపాలిటీల్లో ఎండలను దృష్టిలో ఉంచుకుని ఒక పూట పని విధానం అమలు చేస్తున్నారని కార్మికులు పేర్కొన్నారు. అదే విధానాన్ని తూప్రాన్‌లో అమలు చేయాలని కోరగా, అధికారులు రెండు పూటల పనిని కొనసాగించాలని సూచించడం తీవ్ర నిరాశకు గురిచేస్తోందని వారు తెలిపారు.

శనివారం ఉదయం విధులు ముగించుకుని వెళ్లే సమయంలో మున్సిపల్ అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారని, అవసరమైతే తమ స్థానంలో ఇతర లేబర్‌ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని కార్మికులు ఆరోపించారు. ఎండల్లో ఉదయం, సాయంత్రం రెండు పూటలుగా పని చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, ఇది తమ ఆరోగ్యానికి ప్రమాదకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్న ఈ పరిస్థితుల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణం స్పందించి మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకుని తమను ఆదుకోవాలని తూప్రాన్ మున్సిపల్ సఫాయి కార్మికులు విజ్ఞప్తి చేశారు.