calender_icon.png 10 December, 2025 | 2:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీలాంటి కుక్కలను మస్తు చూశా!

10-12-2025 01:56:37 AM

  1. రేవంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్, హరీశ్‌లను జైలుకు పంపే కుట్ర 
  2. నీ వసూళ్ల చిట్టా విప్పితే తల ఎక్కడ పెట్టుకుంటావు?
  3. మంత్రి పదవులు అమ్ముకున్న చరిత్ర నీది
  4. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్

హైదరాబాద్ సిటీ బ్యూరో/మేడ్చల్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ‘నీలాంటి కుక్కలను మస్తు చూశా. రేవంత్‌రెడ్డితో కలిసి కేటీ ఆర్, హరీశ్‌లను జైలుకు పంపే కుట్ర చేస్తున్నావు. నీ వసూళ్ల చిట్టా విప్పితే తల ఎక్కడ పెట్టుకుంటావు’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విరుచుకుపడ్డారు. ఇటీవల జాగృతి జనం బాటలో భాగంగా కూకట్‌పల్లిలో పర్యటించిన కవిత.. ఎమ్మెల్యే మాధ వరం కృష్ణారా వుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆయనకు భూ కబ్జాలపై ఉన్న దృష్టి ప్రజల మీద ఉంటే బాగుండేది అని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే కృష్ణారావు.. మంగళవారం కూకట్‌పల్లిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కవితపై విరుచుకుపడ్డారు. తనను కబ్జాదారుడు అంటూ కవిత విమర్శలు గుప్పించడంపై మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో మం డిపడ్డారు. దేశ రాజధానిలో లిక్కర్ దందా చేసి తెలంగాణ పరువు తీసింది అని విమర్శించారు.

చివరకు ఇంట్లో కుక్క పేరు కూడా విస్కీ అని పెట్టుకుందని అన్నారు. హరీశ్‌రావును పార్టీ నుం చి వెళ్లగొట్టి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కుమ్మక్కై కేటీఆర్‌ను జైలుకు పంపి పార్టీని ఆధీనంలోకి తీసుకుని రాష్ట్రాన్ని దోచుకునేందుకు కుట్ర చేసిందని విమర్శించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం లో కవిత పర్యటన ఉందని తాను భయపడిపోయాను అంటూ ఆమె చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ‘నీలాంటి కుక్కలు నా నియోజకవ ర్గానికి చాలా వచ్చిపోతుంటాయి’ అన్నారు. జిల్లా ల్లో తిరుగుతూ ఎమ్మెల్యేలను తిడుతూ వారిని సెటిల్ చేసుకోవడం కవిత అలవాటుగా పెట్టుకున్నదని ఆరోపించారు. 

నేను నోరు విప్పితే తల ఎక్కడ పెట్టుకుంటావు?

‘నేను నీ కబ్జాల చిట్టా విప్పితే తట్టుకోలేవు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ అక్రమాలు, నీ మొగుడి అక్రమాలు బయటకు తీస్తే తల ఎక్కడ పెట్టుకుంటావు’ అని ప్రశ్నించారు. ‘బట్టల షాపులు, బంగారం షాపులు వదలని నీవు.. నన్ను కబ్జాదారుడిని అంటావా? మంత్రి పదవులు ఎంతకు అమ్ముకున్నావో అందరికీ తెలుసు. నీ అత్తగారి ఊర్లో గెలవడం చేతకాని నీకు నా గురించి మాట్లాడే అర్హత లేదు’ అని దుయ్యబట్టారు. ‘నీ లాంటి కుక్కలను మస్తు మందిని చూశా.

నీకు ఎవడు భయపడతాడు.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం బంద్ చేసి ప్రజా సేవ చేయడం నేర్చుకో’ అని తీవ్ర పదజాలంతో హెచ్చరించారు. కేసీఆర్ దేవుడని, ఆయన పేరును, పార్టీని కవిత సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి కేటీఆర్, హరీశ్‌రావులను జైలుకు పంపాలని కుట్ర చేస్తున్న సంగతి మాకు తెల్వదు అనుకున్నావా’ అని మాధవరం సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవని వార్నింగ్ ఇచ్చారు.

బాలనగర్ లో కవిత, ఆమె భర్త అనిల్ కబ్జాల చిట్టా ఉందని కృష్ణారావు ఆరోపించారు. ఓవర్ లాప్ ల్యాండ్‌ను పార్టీ పేరు చెప్పుకొని 36 ఎకరాలు దోచుకున్నారన్నారు. కవితే కబ్జాలకు పాల్పడి తనను కబ్జాదారు అని విమర్శించడం విడ్డూరంగా ఉన్నదన్నారు. కాగా కవిత వర్సెస్ బీఆర్‌ఎస్ ఎపిసోడ్ ఇప్పుడు ప్రత్యర్థులకు వరంలా మారింది.

గత పదేళ్లలో జరిగిన అవినీతిని కవిత స్వయంగా బయటపెడుతుండటం కాంగ్రెస్, బీజేపీలకు అస్త్రంగా మారుతోంది. కన్నతండ్రి కేసీఆర్‌ను, కుటుంబాన్ని విభేదించి తన దారి తాను వెతుక్కుంటున్నా అంటూ జనంలోకి వచ్చిన కవిత.. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలనే టార్గెట్ చేయడం రచ్చగా మారింది. హరీశ్‌రావు, సంతోశ్‌రావులపై ఆరోపణలతో మొదలైన ఆమె ఎటాక్.. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలపైకి మళ్లింది.