మూమునూరు ఎయిర్‌పోర్టు మాట ఉత్తదేనా?
మోదీ ప్రసంగంలో ఊసేలేని వైనం
ఓరుగల్లు ప్రజల్లో చర్చనీయాంశం
వరంగల్, మే 8 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం లక్ష్మీపురంలో జరిగిన సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోట మామునూరు ఎయిర్‌పోర్టు మాట రాకపోవడం చర్చనీయాంశంగా మారుతోంది. కొద్దిరోజులుగా మామునూరు ఎయిర్‌పోర్టులో విమానాలు సందడి చేయడంతో సర్వే జరుగున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి అరూరి రమేశ్ కూడా తనను గెలిపిస్తే మామునూరు ఎయిర్‌పోర్టును పునరు ద్ధరించేలా కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. తన మ్యానిఫెస్టోలో కూడా మామునూరు ఎయిర్‌పోర్టు అంశం పొందుపరచడమే కాకుండా సభలో తాను ప్రసంగిస్తున్న సందర్భంలో కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి విన్నవించారు. అయితే మోదీ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా ఎయిర్‌పోర్టు ఊసెత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆ పార్టీ నాయకులతోపాటు ప్రజల్లో కూడా నిరుత్సాహం వ్యక్తమ వుతోంది. సభకు హాజరైన సందర్భంలో ఎయిర్‌పోర్టులోనే విమానం దిగిన మోదీ ప్రసంగంలో మాత్రం పునరుద్ధరణ గురించి మాట్లాడకపోవడం గమనార్హం.
ఎన్నికల ప్రచారానికే ఎయిర్‌పోర్టు
రాష్ట్రంలో ఏ ఎన్నికలొచ్చినా అన్ని రాజకీయ పార్టీలకు మామునూరు ఎయిర్‌పోర్టు పునరుద్ధరణ ఆంశం ప్రచారాస్త్రంగా మారుతోంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో ప్రధాన పార్టీలు ఈ విషయంపై హామీలు గుప్పిస్తున్నా తర్వాత దాని గురించి పట్టించుకునే వారే కరువుతున్నారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ప్రచారంలో చెప్తున్నారు. ఏది ఏమైనా మామునూరు ఎయిర్‌పోర్టు మాత్రం నాయకులకు ప్రచారానికి మాత్రమే పనికి వస్తుందనే భావన వ్యక్తమవుతోంది.




