సునీతా మహేందర్ రెడ్డిపై బీజేపీ నేతల ఫిర్యాదు
హైదరాబాద్, మే 8, (విజయక్రాంతి) : మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిపై బీజేపీ నేతలు బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వీడియోలను బీజేపీకి వ్యతిరేకంగా మార్ఫింగ్ చేసి.. పట్నం సునీతా మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి ట్విట్టర్, ఇన్ స్టా ఫ్యాన్ పేజీలో పోస్టు చేశారని వెల్లడించారు. మల్కాజ్ గిరి ఓటర్లు మద్యం, డబ్బు ప్రలోభాలకు లొంగుతారు అని ఆ వీడియోలో రాజేందర్ అన్నట్లు మార్ఫింగ్ చేశారని, అందులో ఎలాంటి సత్యం లేదని నాయకులు తెలిపారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో బీజేపీ లీగల్ సెల్ జాయింట్ కన్వీనర్ సోమసి శ్రీనివాస్, కార్పొరేటర్ వి. శ్రవణ్, మహిళా మోర్చా లీగల్ సెల్ అడ్వైజర్ ప్రసన్న, ఎం. విజయ్‌కాంత్, శ్రీకాంత్ వడ్ల, ఎం. రాజు యాదవ్ ఉన్నారు.




