25-05-2025 12:37:49 AM
-ఈడీపై బీఆర్‌ఎస్ నేతల తీరు విచిత్రం
-పదేళ్లు దెయ్యంలా తెలంగాణను పట్టి పీడించారు
-రాష్ర్ట ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారు
-బీజేపీతో చీకటి ఒప్పందం.. అందుకే కాంగ్రెస్‌పై విమర్శలు
-మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటన
హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఈడీ ఇప్పుడు బీఆర్‌ఎస్ నాయ కులకు పవిత్రంగా కనిపిస్తున్నదా అని రాష్ర్ట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు.
ఇప్పుడు పొగుడుతున్న దర్యాప్తు సంస్థే గతంలో కవితపై కేసు నమోదు చేసిన సంగతిని మర్చిపోయారా అంటూ ఆయన విమర్శించారు. అక్రమంగా కేసులు నమోదు చేయడాన్ని సమర్థిస్తున్నారా లేదా చెప్పాలని శనివారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో శ్రీధర్‌బాబు అన్నారు.
60 ఏళ్ల కలను సాకారం చేస్తూ సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే, పదేళ్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణను దెయ్యంలా పట్టి పీడించిందని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ, నియంతృత్వ పాలనతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆ పార్టీ నాయకులకు కాంగ్రెస్‌ను విమర్శించే హక్కు లేదన్నారు.
ఆ చేదు జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలిప్పుడిప్పుడే మరిచిపోతున్నారున్నారు. ఈడీని పావుగా చేసుకొని కేడర్ ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ అగ్ర నాయకులపై బీజేపీ పెడుతున్న అక్రమ కేసులను బీఆర్‌ఎస్ నాయకులు సమ ర్థించడం వెనుకున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
రాహుల్‌గాంధీ మార్గనిర్దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. బీజేపీ పెడుతున్న అక్రమ కేసులపై స్పం దించాల్సిన అవసరం రాహుల్‌గాంధీకి లేదన్నారు. ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత కూడా బీఆర్‌ఎస్ నాయకులకు లేదని ఆయన చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నాయకులు తమపై విమర్శలు చేస్తున్నారన్నారు. జాతీయ పార్టీలో నిర్ణయాలన్నీ అధినాయకత్వమే తీసుకుంటుందనే కనీస అవగాహన పదేళ్లపాటు అధి కారంలో ఉన్న బీఆర్‌ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరమని శ్రీధర్‌బాబు అన్నారు.
అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్ట ప్రయో జనాలు పట్టకుండా కేంద్రంతో తరచూ తగువు పెట్టుకున్న మీకెలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు.రాష్ర్టం కోసం సీఎం ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడంలో తప్పేముందని, ఈ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో సమాధానం చెప్పాలని శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు.
సీఎం తరచూ ఢిల్లీకి వెళ్లడం వల్లే సికింద్రాబాద్ నుంచి శామీర్ పేట్ వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్, కాజీపేట్ లోకో ఫ్యాక్టరీ, జహీరాబాద్ నిమ్జ్ విషయంలో కదలిక వచ్చిందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
రుణ మాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు మీ కంటికి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిలో తెలంగాణను నంబర్ వన్ గా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్‌ఎస్ విమర్శించడం సరికాదన్నారు. సీఎం నచ్చాల్సింది తెలంగాణ ప్రజలకు తప్ప.. మీకు, మీ కేడర్‌కు కాదని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ మీరే అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తించడం మీకే మంచిది కాదని ఆయన హితవు పలికారు.