calender_icon.png 4 May, 2025 | 12:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబీమా ఉందా.. అటకెక్కించారా?

04-05-2025 01:20:15 AM

  1. ప్రీమియం చెల్లించని ప్రభుత్వం 
  2. వందకు పైగా రైతుల కుటుంబాలకు అందని సాయం
  3. మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుబీమా ఉందా.. అటకెక్కించారా అనే అనుమానం కలుగుతోందని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఆయా కారణాలతో గత మూడు నెలల్లో సుమారు వందకు పైగా రైతులు చనిపోయినట్లు తెలుస్తోందని, ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆయా కుటుంబాలకు రైతుబీమా సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

శనివారం ఎక్స్ వేదికగా కాంగ్రెస్ ఫెల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ బీట్రెయిడ్ ఫార్మర్స్ హ్యాష్‌ట్యాగ్‌తో సీఎం రేవంత్‌రెడ్డిని ట్యాగ్ చేస్తూ హరీశ్‌రావు పోస్టు పెట్టారు. రైతు మరణిస్తే అతడి కుటుంబం రోడ్డున పడొద్దనే ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ రైతుబీమా పథకాన్ని తీసుకొచ్చార న్నారు.

ఆ పథకాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరిలో నెలలోనే చెల్లించాల్సిన రూ.775 కోట్ల ప్రీమియం మూడు నెలలుగా ప్రభుత్వం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. రైతు కుటుంబాలకు ప్రభుత్వమే రూ.5 లక్షల చొప్పున చెల్లించి ఎల్‌ఐసీకి పెండింగ్‌లో ఉన్న ప్రీమియం తక్షణం కట్టాలని డిమాండ్ చేశారు.

‘ఉపాధి’ పని దినాలు తగ్గిస్తారా?

రాష్ట్రానికి మంజూరైన ఉపాధిహామీ పనిదినాలను కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించడం శోచనీయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హారీశ్‌రావు విమర్శించారు. 2024-25లో రూ.12.22 కోట్ల పనిదినాలు మంజూరు చేస్తే, ఈ ఏడాది కేవలం రూ.6.5 కోట్ల పనిదినాలకే పరిమితం చేయడమేంటని ప్రశ్నిస్తూ శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 మంది ఎంపీలున్నా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని విమర్శిం చారు. ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోందని, వారి జీవితాలతో ఆడుకుంటోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం వెంటనే ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని, రాష్ట్రం నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.