8 June, 2026 | 1:49 AM

రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి రక్షణ లేదా..?

08-06-2026 12:11 AM

అశ్వాపురంలో చెత్తకుప్పలో అంబేద్కర్ విగ్రహం.. 13వ రోజుకు చేరిన నిరసనలు

అశ్వాపురం, జూన్ 6 (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ తొలగించి చెత్తకుప్పలో పడేయడాన్ని నిరసిస్తూ అశ్వాపురం మండల కేంద్రంలో దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విగ్రహాన్ని తొలగించి ఆదివారానికి 13 రోజులు గడిచినా అధికారులు స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్థానికుల కథనం ప్రకారం 13 రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు జేసీబీ సహాయంతో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆర్ అండ్ బీ కార్యాలయం సమీపంలోని ప్రాంతంలో ఉంచారని ఆరోపించారు. ఈ ఘటన అనంతరం విగ్రహం వద్దనే దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు నిరసన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా నిలిచిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన విధానం బాధాకరమన్నారు.

విగ్రహాన్ని ఎక్కడి నుంచి తొలగించారో తిరిగి అదే ప్రదేశంలో ప్రతిష్ఠించే వరకు తమ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. అధికారుల తీరుపై ప్రజల్లో తీవ్ర ఆవేదన, అసంతృప్తి నెలకొందన్నారు. అంబేద్కర్ విగ్రహం అంశంపై తక్షణమే పరిష్కారం చూపాలని, లేకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ వాదులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘జై భీమ్‘ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.