ప్రైవేట్ చిట్టీ, అక్రమ వడ్డీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలి
మణుగూరు, జూన్ 7,(విజయక్రాంతి) : మండలంలో ప్రైవేట్ చిట్టీ, అక్రమ వడ్డీ వ్యాపారుల దందా రోజురోజుకు పెరుగు తోందని రేణుక అక్షర మహిళా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. ఆదివారం రేణుక క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షురాలు పూనెం సరోజ మాట్లాడారు. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజలను అధిక వడ్డీల పేరుతో దోపిడీ చేస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
స్థానిక డీఎస్పీ, సీఐలు చిట్టీ, ఫైనాన్స్, వడ్డీ వ్యాపారాల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న వారి పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు రేణుక అక్షర మహిళా మండలి అండగా నిలుస్తుందని, అవసరమైతే వారిని పోలీసు అధికారుల వద్దకు, జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. మహిళా సీనియర్ నాయకురాలు ఎండీ షబానా, కోరి శ్యామల, బొడ్డు సౌజన్య, డేరంగుల సుజాత, రెడ్డీబోయిన రేణుక, బడిశా పార్వతి, హేమలత, సౌజన్య డాకూరి పాల్గొన్నారు.






