ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యం
6 ఏళ్ళ క్రితం వలస వచ్చిన కుటుంబం
నల్లగొండ క్రైం, జూన్ 7: పట్టణంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు శనివారం నుండి కనిపించకుండా పోవడంతో స్థానికంగా ఆదివారం ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగిత్యాల జిల్లాకు చెందిన గిరి శ్రీకాంత్(44), ఆయన భార్య లక్ష్మి (42), కుమార్తె హర్షిత(23), కుమారుడు సాయిచరణ్(20) ఆరు సంవత్సరాల క్రితం నల్గొండకు జీవనోపాధి కోసం వలస వచ్చారు.
పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులోని బీటీఎస్, శ్రీనివాస కాలనీలో నివాసముంటున్న శ్రీకాంత్ దంపతులు స్థానిక కిరాణా దుకాణాల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం నుండి ఈ నలుగురు అదృశ్యమయ్యారు. ఇల్లంతా వెతికినా, తెలిసిన వారిని విచారించినా వీరి ఆచూకీ లభించలేదు. కనిపించకుండా పోయిన ఈ కుటుంబం గురించి పోలీస్లకు సమాచారం ఇవ్వాలని వన్ టౌన్ ఎస్‌ఐ సైదులు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే 8712667 70, 8712577228 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు కోరారు.






