calender_icon.png 5 October, 2025 | 12:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజాపై ఆగని ఇజ్రాయెల్ దాడులు

05-10-2025 12:48:35 AM

  1. నగరంపై బాంబుల వర్షం.. ఆరుగురు పాలస్తీనియన్లు మృతి
  2. ట్రంప్ నేతృత్వంలో శాంతి ఒప్పందాలపై చర్చలు జరుగుతున్న వేళ దాడి
  3. దాడులు తక్షణం ఆపాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ పిలుపు

గాజా, అక్టోబర్ 4: ఇజ్రాయెల్  గాజా మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో శాంతి ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ ఇజ్రాయెల్ తాజాగా గాజాపై దాడులు చేసింది. నగరంలోని ఇంటిని టార్గెట్ చేసి బాంబ్‌ల వర్షం కురిపించింది. దాడుల్లో నలుగురు పాలస్తీనియన్లు మృతిచెందారు. అలా గే ఖాన్‌యూనిస్ ప్రాంతంలో జరిపిన దాడుల్లో మరో ఇద్దరు పాలస్తీనియన్లు మృత్యువాతపడ్డారు.

ఈ పరిణామం శాంతి ఒప్పందాలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది.  బందీల విడుదల, యుద్ధ విరమణ లక్ష్యంగా ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి హమాస్ సానుకూలంగా స్పందించిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ దాడులు జరపడం గమనార్హం. తాజా పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘హమాస్ శాంతి ఒప్పందానికి సిద్ధంగా ఉందని నేను నమ్ముతున్నాను.

వారి నిర్బంధం నుంచి బందీలు సురక్షితంగా బయటకు రావాలంటే ఇజ్రాయెల్ తక్షణం దాడులు ఆపాలి’ అని సూచించారు. శాంతిఒప్పందాల అంశం కేవలం గాజాకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, మధ్యప్రాచ్యంలో దీర్ఘకాల శాంతి నెలకొనేందుకు ఒప్పందాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.