16 July, 2026 | 9:00 AM

సమయము చూడని సమరమిది..

18-06-2024 12:05 AM

“ప్రపంచంలో ఒకటే ఒక సైడ్.. నీ సైడ్‌” అని ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్‌లో ప్రభాస్ పలికిన మాట అందిరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో సినిమాలో ఆయన పాత్ర తీరు తెన్నులను కొంతవరకు పరిచయం చేశారు దర్శక నిర్మాతలు. కాగా సోమవారం మధ్యాహ్నం విడుదలైన ‘భైరవ యాంథమ్’ లిరికల్ వీడియోలోని “నేనా నువ్వా అంటే.. నాకు ముఖ్యం నేనంట. గెలుపు జెండాలే నా దారంట. మనసు ఉన్నా గాని లేదంట. మెదడు మాటేనేవింటా.

మాయదారి లోకంలో ఇంతే ఇంతే నేనంట” అనే పదబంధాలతో మొత్తంగా కథానాయకుడు భైరవ పాత్ర స్వభావాన్ని తెలియజేశారు. ఈ గీతానికి రామజోగయ్య శాస్త్రి, కుమార్‌లు సాహిత్యం సమకూర్చగా, స్వరకర్త అయిన సంతోష్ నారాయణన్, గాయకులు దిల్జీత్ దోశాంజ్, దీపక్ బ్లూ లతో కలిసి పాడారు. ఇన్నాళ్ళు సినిమా కోసం వేచియుంచిన ‘కల్కి’ బృందం ఇప్పుడు సినిమాలోని ఒక పాట కోసం గత రెండు రోజులుగా ప్రేక్షకులను ఎదురు చూసేలా చేశారు.

ట్రైలర్‌లో చూపించినట్టు కొత్త ఆరంభం కోసం జరిగే యుద్ధాన్ని ఉద్దేశిస్తూ “సాహస మంత్రమే నా జవ జీవము.. సమయము చూడని సమరమిది” అంటూ సాగే ఈ గీతం ఒక్కసారి వినగానే లోలోపల ప్రతిధ్వనించేలా ఉంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉండనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా వైజయంతి మూవీస్ సంస్థలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, ప్రచార కార్యక్రమాల్లో భాగంగా త్వరలో ముంబయిలో చిత్ర బృందం ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.