21-01-2026 12:00:00 AM
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపు
ఇల్లెందు, జనవరి 20, (విజయక్రాంతి): స్వాతంత్య్ర ఉద్యమ శంఖారావం వందేమాతరం గేయానికి 150 ఏళ్ల నిండిన సందర్భాన్ని గుర్తుచేసే అరుదైన చిత్రాలతో పాటు భారత రాజ్యంగ రచన ఘట్టాలను తెలియజేసేలా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మంగళవారం ప్రారంభించారు. ఇల్లందు సింగరేణి గ్రౌండ్ లో ఏర్పాటుచేసిన మూడురోజుల ఎగ్జిబిసన్ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ..
వందేమాతరం అనేది కేవలం ఒక గీతం కాదని, అది భారత స్వాతంత్య్ర పోరాటానికి ప్రాణం పోసిన త్యాగస్ఫూర్తి, దేశభక్తి, జాతీయ ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. వందేమాతరం నినాదం భారతీయుల ఆత్మగౌరవానికి, స్వాతంత్య్ర ఉద్యమంలో వారి తపన-త్యాగాలకు ప్రతిరూపమని పేర్కొన్నారు. సుమారు 150 సంవత్సరాల క్రితం మహాకవి బంకించంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం భారతమాత ఔన్నత్యం, ఆధ్యాత్మిక వైభవం, సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు.
బ్రిటిష్ పాలకుల విభజించి పాలించు విధానానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసిన శక్తి వందేమాతరమేనని, కులం, మతం, ప్రాంత భేదాలు మరిచి దేశమే ప్రథమం అన్న భావనను పెంపొందించిందని ఆయన అన్నారు. 1938లో నాటి హైదరాబాద్ సంస్థానంలో ప్రారంభమైన వందేమాతర ఉద్యమాన్ని నిజాం ప్రభుత్వం నిషేధించిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన మహనీయుల త్యాగాలను కొనియాడారు. ఆనాటి త్యాగాలను నేటి తరానికి తెలిసేలా ఎగ్జిబిషన్ ఉందని పేర్కొన్నారు. నేటి తరం వందేమాతరం 150వ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధిలో భాగస్వాములవ్వాలని కోరారు.
విద్యార్థినులు, యువతులు విద్య, కెర్పీ దృష్టి సారించి విజయం సాధించాలని ఎమ్మెల్యే కనకయ్య పేర్కొన్నారు. ఈసందర్భంగా వివిధ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. అంతకు ముందు సింగరేణి జనరల్ మేనేజర్ వి. కృష్ణయ్య మాట్లాడుతూ వందేమాతరం స్వాతంత్ర పోరాటా నికి ప్రతీక అని కొనియాడారు.
వందే మాతరం స్ఫూర్తి నేటి యువతకు ఎంతో అవసరం అని పేర్కొన్నారు. సీబీసీ ఫీల్ పబ్లిసిటీ అధికారి బి.తరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీబీసీ అసిస్టెంట్ డైరెక్టర్ కోటేశ్వర్రావు తన ప్రారంభ ప్రసంగంలో వందే మాతరం గేయం, స్వాతంత్య్ర పోరాటంలో పోషించిన కీలక పాత్రను ప్రస్తావించారు. జాతీయగేయంగా తరతరాలుగా ప్రజలను ప్రేరేపిస్తూ దేశవ్యాప్తంగా లోతైన దేశభక్తి భావాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు.
వందే మాతరం ప్రయాణానికి 150 సంవత్సరాలు పూర్తున సందర్భంగా, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నం జాతీయ వాదాన్ని పునరుద్దీపింపజేయడం, పౌరులు భారతదేశంతో భావోద్వేగపరంగా, సాంస్కృతికంగా మళ్లీ అనుసంధానమయ్యేలా చేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని చెప్పారు. కార్యక్రమంలో ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు, పురపాలక మాజీ చైర్మన్, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్ళు, అధ్యాపకులు, సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.