కొండ నాలుకకు మందు పెడితే.. ఉన్న నాలుక ఊడినట్లు..
వీబీ జీరాంజీ పథకం మాజీ ఎమ్మెల్సీ, సీసీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు
ఎల్బీనగర్, జులై 8 : కొండ నాలుకకు మందు పెడితే ఉన్న నాలుక ఊడినట్లు అన్నచందంగా వీబీ జీరాంజీ పథకం ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, సీపీఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు ఎద్దేవా చేశారు. బుధవారం మన్సూరాబాద్ లో ఆయన తన నివాసంలో మాట్లాడుతూ... ఉపాధి హామీ గతంలో వామపక్షాల చొరవతో యుడిఎఫ్ ప్రభుత్వం తెచ్చిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్) దాంతో కోట్లాదిమందికి ఉపాధి తో పాటు కొనుగోలు శక్తి పెరిగిందని గుర్తు చేశారు.
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చెక్ డ్యాముల నిర్మాణం, చెరువుల తవ్వకం,మట్టి తవ్వకం లాంటివి చేస్తూ గ్రామ ప్రజలు ఉపాధి పొందేవారని, ప్రజామోదం పొందిన గత చట్టాన్ని అమలు కాకుండా ఇటీవల బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వీ బీ జీరాంజీ చట్టాన్ని అమలు కోసం కేంద్రం నిరంకుశంగా రాష్ట్రాలపై రుద్దుతుందని ఆరోపించారు. నూతన చట్టంలో కేంద్రం 60 శాతం ఇస్తే రాష్ట్రం 40 శాతం భరించాలి, అది కూడా ముందు రాష్ట్రం చెల్లిస్తేనే ఆ తర్వాత కేంద్రం మిగతా వాటిని చెల్లిస్తుందని చెప్పారు.
దీంతో కూలి పని దినాలు తగ్గి పూర్తిగా ఈ పథకం నీరు గారే ప్రయత్నం జరుగుతున్నదని ఆయన గుర్తు చేశారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో 64 గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. ఏడు సంవత్సరాల క్రితం 16 మేజర్ గ్రామపంచాయతీలు మున్సిపాలిటీలో కలిశాయి. ఫ్యూచర్ సిటీలో 56 గ్రామాలు విలీనమయ్యాయి. మొత్తం 120 గ్రామాలు నగర పరిధిలో ఉండడంతో ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలకు గ్రామీణ వాతావరణం అలాగే కొనసాగడం వారికి పని దొరకపోవడంతో చాలామంది వలస వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పునరాలోచన చేసి ఉపాధి హామీ పథకాన్ని మున్సిపాలిటీల్లో కూడా అమలు చేయాలని డిమాండ్ చేశారు.






