20-08-2025 01:06:14 AM
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
మద్నూర్, ఆగష్టు 19 ( విజయ క్రాంతి), ప్రతి రైతుకు నష్టపరిహారం అందించే బాధ్యత తనదని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా మద్నూర్ , డోంగ్లి మండలాల్లో పంట నష్టం జరిగిన రైతులను కలిసి మాట్లాడారు. రైతులు ఆందోళన చెందవద్దని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక ప్రభుత్వానికి అందించేలా కృషి చేయాలని సూచించారు.మద్నూర్, డోంగ్లి, మండలాల్లోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటిం చారు.
వరద ముంపునకు గురైన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జుక్కల్ నియోజకవర్గంలోని ఏ మండల పరిధిలోనైనా వరద నీటికి ముంపుకు గురై, పంట నష్టం జరిగిన వాటికి అధికారులతో క్షుణ్ణంగా పరిశీలింప చేస్తానని తెలిపారు. ప్రతి రైతుకు పంట నష్టపరిహారం అందించడమే నా బాధ్యత అని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగకూడదని, నా బాధ్యతగా రాత్రింబవళ్లు కష్టపడతానని తెలిపారు.
రాబోయే ఒకటి రెండు రోజులు భారీ వర్షా లు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరికలను జారీ చేసిందని, అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల కోసం అందుబాటులో ఉండి సేవలు అందించాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజల కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు.
బిచ్కుంద మండలం శెట్లూర్ గ్రామంలో వరద నీటిలో చిక్కుకున్న గొర్రెలను, గొర్రెల కాపరులను కాపాడడం గొప్ప విజయమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద వ్యవసాయ శాఖ ఏడిఏ అభినబి, డోంగ్లి తాసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ ఐ సాయిబాబా, మండల వ్యవసాయ అధికారులు, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ శాఖ అధికారులు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ఆయా మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.