జాక్స్ రాక్స్..

29-04-2024 12:34:49 AM

హాఫ్ సెంచరీతో మెరిసిన కోహ్లి 

గుజరాత్‌పై బెంగళూరు విజయం

ఆశలు అడుగంటిన వేళ.. ఆర్సీబీ అదరగొడుతోంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హిట్టర్లకు ముకుతాడు వేసిన బెంగళూరు.. తాజాగా గుజరాత్ భరతం పట్టింది. సొంతగడ్డపై రెండొందల పరుగులు చేసి నిశ్చింతగా ఉన్న గుజరాత్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ.. మరో నాలుగు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్, షారుక్ ఖాన్  మెరుపులతో గుజరాత్ మంచి స్కోరు చేస్తే.. విల్ జాక్స్ ఊర మాస్ ఇన్నింగ్స్‌తో వాటిన్నింటినీ మైమరిపించాడు. కోహ్లీ క్లాస్ షాట్లకు జాక్స్ దబిడి దిబిడి దంచుడు తోడవడంతో అహ్మదాబాద్ స్టేడియం మోతెక్కిపోయింది!

అహ్మదాబాద్: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండో విజయం నమోదు చేసుకుంది. ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపు అసాధ్యమైన వేళ.. స్వేచ్ఛగా ఆడిన బెంగళూరు 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తుచేసింది. ఆదివారం జరిగిన పోరులో గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం 16 ఓవర్లలోనే ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (49 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షారుక్ ఖాన్ (30 బంతుల్లో 58; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించగా.. మిల్లర్ (19 బంత్లులో 26; 2 ఫోర్లు, 1 సిక్సర్) పర్వాలేదనిపించాడు.

బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్, సిరాజ్, మ్యాక్స్‌వెల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం 201 పరుగుల లక్ష్యఛేదనలో బెంగళూరు 16 ఓవర్లలో ఒక వికెట్ కోలోయి 206 పరుగులు చేసింది. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్; 5 ఫోర్లు, 10 సిక్సర్లు) అజేయ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. విరాట్ కోహ్లి (44 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో బెంగళూరును గెలిపించిన విల్ జాక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా సోమవారం జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. 

50 నుంచి 100కు..

31 బంతుల్లో 50 పరుగులు.. ఈ స్కోరు చూస్తే  సాధారణంగా కనిపిస్తోంది.. అదే 10 బంతుల్లో 50 పరుగులు అంటే విధ్వంసం అనే పదం కూడా చిన్నదిగా మారిపోతుంది. ఈ మాట విల్ జాక్స్ ఇన్నింగ్స్‌కు అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. బెంగళూరు విజయానికి 36 బంతుల్లో 56 పరుగులు అవసరమైన దశలో జాక్స్ విస్పోటనం మొదలైంది. అప్పటివరకు 29 బంతుల్లో 44 పరుగులతో జాక్స్ ఇన్నింగ్స్ సాధారణంగా కనిపించింది. ఈ దశలో 15 ఓవర్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌కు వచ్చాడు. ఆ ఓవర్లో జాక్స్ వరుసగా 4, 6, 6 (నోబాల్), 2, 6, 4 సంధించి 29 పరుగులు పిండుకున్నాడు.

దెబ్బకు అతని స్కోరు 44 నుంచి 72కు మారింది. ఇక రషీద్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి బంతిని కోహ్లి సింగిల్ తీసి జాక్స్‌కు స్ట్రుక్ అందించాడు. అంతే పూనకం వచ్చినవాడిలా చెలరేగిపోయిన జాక్స్ వరుసగా 6, 6, 4, 6, 6తో మొత్తంగా 29 పరుగులు పిండుకున్నాడు. పనిలో పనిగా 41 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకోవడంతో పాటు బెంగళూరుకు విజయాన్ని అందించాడు. విల్ జాక్స్ విధ్వంసాన్ని కోహ్లీ ఒక ఎండ్‌లో నిల్చొని కళ్లు అప్పగించి చూస్తు ఉండిపోవడం గమనార్హం. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్: 20 ఓవర్లలో 200/3 (సాయి సుదర్శన్ 84 నాటౌట్, షారుక్ ఖాన్ 58; స్వప్నిల్ సింగ్ 1/23), బెంగళూరు: 16 ఓవర్లలో 206/1 (విల్ జాక్స్ 100 నాటౌట్, కోహ్లీ 70 నాటౌట్; సాయి కిషోర్ 1/౩౦).