రెజింగ్ డౌన్

29-04-2024 12:39:34 AM

హైదరాబాద్ వరుసగా రెండో ఓటమి

రుతురాజ్, డారిల్ మెరుపులు n ప్లే ఆఫ్స్‌కు చేరువైన చెన్నై

కొండంత స్కోర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. వరుసగా రెండో మ్యాచ్‌లో లక్ష్యఛేదనలో తడబడింది. గత పోరులో బెంగళూరు విధించిన రెండొందల పైచిలుకు లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన రైజర్స్.. ఈసారి చెన్నైతో మ్యాచ్‌లో సేమ్ సీన్ రిపీట్ చేసింది. కాస్తునా పోరాడకముందే కాడి ఎత్తేసింది. 

రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌కు డారిల్, దూబే దంచుడు తోడవడంతో మొదట చెన్నై భారీ స్కోరు చేయగా.. ఛేదనలో మనవాళ్లు కనీస

ప్రతిఘటన లేకుండానే పరాజయాన్ని అంగీకరించారు. ఒక్కరంటే ఒక్కరు కూడా కనీస పోరాటం కనబర్చలేకపోవడంతో హైదరాబాద్ ఖాతాలో వరుసగా రెండో ఓటమి చేరింది. 

చెన్నై: వరుస విజయాలతో ఈ సారి టైటిల్ పట్టడం ఖాయమని ఆశలు రేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆట మళ్లీ గాడి తప్పింది. బ్యాటింగ్ వైఫల్యంతో ఆదివారం జరిగిన రెండో పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 00 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. సొంతగడ్డపై టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (54 బంతుల్లో 98; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో శతకం చేజార్చుకోగా.. డారిల్ మిషెల్ (32 బంతుల్లో 52; 7 ఫోర్లు, ఒక సిక్సర్), శివమ్ దూబే (20 బంతుల్లో 39 నాటౌట్; ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అజింక్యా రహానే (9) విఫలం కాగా.. చివరి ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన మహేంద్రసింగ్ ధోనీ (2 బంతుల్లో 5 నాటౌట్; ఒక ఫోర్) అజేయంగా వెనుదిరిగాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జైదేవ్ ఉనాద్కట్, నటరాజన్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో సన్‌రైజర్స్ 18.5 ఓవర్లలో 134 పరుగులకు ఆలౌటైంది. ఎయిడెన్ మార్క్మ్ (32; 4 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా.. ట్రావిస్ హెడ్ (13), అభిషేక్ వర్మ (15), అన్మోల్‌ప్రీత్ సింగ్ (0), నితీశ్ కుమార్ రెడ్డి (15), హెన్రిచ్ క్లాసెన్ (20), అబ్దుల్ సమద్ (19), కమిన్స్ (5) విఫలమయ్యారు.  చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే 4, పతిరణ, ముస్తఫిజుర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 

రెండు పరుగుల దూరంలో

అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రన్‌మెషీన్ విరాట్ కోహ్లీతో పోటీ పడుతున్న చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్ మరో చక్కటి ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం దక్కించుకున్న చెన్నైకి గైక్వాడ్ గట్టి పునాదీ వేశాడు. రహానే ఎక్కువసేపు నిలువలేకపోయినా.. డారిల్ మిషెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఎక్కడా అడ్డ దిట్ట బాదుడు జోలికి పోని గైక్వాడ్.. పక్కా క్రికెటింగ్ షాట్స్‌తో పరుగులు రాబట్టాడు. మూడో ఓవర్‌లోనే రహానే వెనుదిరగగా..ఆ  తర్వాత డారిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 64 బంతుల్లో 107 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 27 బంతుల్లో ఐపీఎల్లో 17వ అర్ధశతకం పూర్తి చేసుకున్న రుతురాజ్.. ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించాడు. ఒక దశలో శతకం చేయడం ఖాయమనిపించగా.. మూడంకెల స్కోరుకు కేవలం రెండు పరుగుల దూరంలో గైక్వాడ్ పెవిలయన్ చేరాడు. ఇక ఈ సీజన్‌లో సిక్సర్లే తన లక్ష్యమన్నట్లు చెలరేగుతున్న శివమ్ దూబే మరోసారి రెచ్చిపోయాడు.

మూకుమ్మడి వైఫల్యం

తాజా సీజన్‌లో ఊహకు అందని విధంగా.. భారీ స్కోర్లు చేస్తూ.. బాదుడే పరమావధిగా రెచ్చిపోయిన సన్‌రైజర్స్.. వరుసగా రెండో మ్యాచ్‌లో లక్ష్యఛేదనలో విఫలమైంది. ఉప్పల్‌లో జరిగిన గత మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో కంగుతిన్న రైజర్స్.. తాజా పోరులో చెన్నై చేతిలో చతికిలబడింది. ట్రికీ పిచ్‌పై టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించిన కమిన్స్.. బౌలింగ్‌లో జట్టును ముందుండి నడిపించలేకపోయాడు. రెండో ఓవర్‌లో హెడ్ ఔట్ కావడంతోనే మ్యాచ్ ఫలితం తేలిపోయింది. ప్రత్యర్థి బౌలర్లతో సంబంధం లేకుండా ఎడాపెడా భారీ షాట్లు ఆడే హెడ్‌ను తుషార్ దేశ్ పాండే బుట్టలో వేసుకోగా.. మరుసటి బంతికే ఇంపాక్ట్ ప్లేయర్ అన్మోల్‌ప్రీత్ సింగ్ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తుషార్ తన మరుసటి ఓవర్‌లో అభిషేక్‌ను కూడా పెవిలియన్ పంపగా.. ఇక అక్కడి నుంచి రైజర్స్ ఛేదన భారంగా సాగింది. మార్క్మ్,్ర క్లాసెన్, సమద్ ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అనుకుంటే అది అత్యాశే అయింది. 

పాంచ్ పటాకా

చెపాక్ స్టేడియంలో ఎక్కడ చూసినా.. డారిల్ మిషెల్ దర్శనమిచ్చాడు. హైదరాబాద్ బ్యాటర్లలో ఏకంగా ఐదుగురిని అతడు ఔట్ చేశాడు. అదేంటీ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన మిషెల్ ఐదుగురిని డగౌట్‌కు పంపడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. మైదానంలో చిరుతను తలపించిన డారిల్ ఐదు క్యాచ్‌లు అందుకొని అదుర్స్ అనిపించాడు. హెడ్, అభిషేక్, క్లాసెన్, షాబాజ్, కమిన్స్ ఇచ్చిన క్యాచ్‌లను డారిల్ ఒడిసి పట్టాడు. 

స్కోరు వివరాలు

చెన్నై: రహానే (సి) షాబాజ్ (బి) భువనేశ్వర్ 9, రుతురాజ్ (సి) నితీశ్ (బి) నటరాజన్ 98, డారిల్ (సి) నితీశ్ (బి) ఉనాద్కట్ 52, దూబే (నాటౌట్) 39; ధోనీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 212/3. వికెట్ల పతనం: 1 2 3 బౌలింగ్: భువనేశ్వర్ 4 నితీశ్ 1 షాబాజ్ 3 నటరాజన్ 4 ఉనాద్కట్ 4 కమిన్స్ 4

హైదరాబాద్: హెడ్ (సి) డారిల్ (బి) దేశ్ పాండే 13, అభిషేక్ (సి) డారిల్ (బి) దేశ్‌పాండే 15, అన్మోల్‌ప్రీత్ (సి) అలీ (బి) దేశ్‌పాండే, మార్క్మ్ (బి) పతిరణ 32, నితీశ్ (సి) ధోనీ (బి) జడేజా 15, క్లాసెన్ (సి) డారిల్ (బి) పతిరణ 20, సమద్ (సి) (సబ్) సమీర్ (బి) శార్దూల్ 19, షాబాజ్ (సి) డారిల్ (బి) ముస్తఫిజుర్ 7, కమిన్స్ (సి) డారిల్ (బి) దేశ్ పాండే 5, భువనేశ్వర్ (నాటౌట్) 4, ఉనాద్కట్ (సి) అలీ (బి) ముస్తఫిజుర్ 1, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 18.5 ఓవర్లలో 134 ఆలౌట్. వికెట్ల పతనం: 1 2 3 4 5 6 7 8 9 10 బౌలింగ్: దీపక్ 3 తుషార్ దేశ్‌పాండే 3 ముస్తఫిజుర్ 2.5 జడేజా 4 శార్దూల్ 4 పతిరణ 2