జగన్ స్వీయ విధ్వంసం!
కర్ణుడి చావుకు వెయ్యికారణాలు అన్న ట్టుగా ఉన్నది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి. తండ్రి అకాల మరణంతో ప్రధాన రాజకీయ స్రవంతిలోకి వెలుగు రేఖగా దూసుకొచ్చి నానా కష్టాలు పడి ఎంతటి అఖండ విజయంతో అధికారాన్ని చేపట్టారో.. అంతే ఓటమితో అథఃపాతాళానికి పడిపోయారు. ఐదేండ్ల పాలనలో ఆయన అమలుచేసిన సంక్షేమ పథకాలకంటే రేపిన వివాదాలే ఆంధ్రప్రజల మనసుల్లో బలంగా ముద్రించుకుపోవటమే జగన్ దారుణ ఓటమికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు. ఉచితాలు, తాయిలాలతోనే ఎన్నికల్లో గెలువగలమనే భమల్లో ఉన్నవారికి తెలంగాణలో బీఆర్‌ఎస్, ఆంధ్రలో జగన్ ఓటమే గుణపాఠాలు.
ఒక్కో అడుగుతో ఆకాశానికి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణంతో రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ శూన్యతను తనకు అనుకూలంగా మలుచుకోవాలని వైఎస్ జగన్ భావించారు. తనను తన తండ్రి స్థానంలో కూర్చోబెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు నాటి ఎమ్మెల్యేలతో సంతకాలు కూడా తీసుకొన్నారు. కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు తావివ్వలేదు. కొణిజేటి రోశయ్యను సీఎంను చేసి జగన్‌ను నిర్లక్ష్యం చేసింది. దీంతో ఆయన తన తండ్రి పేరు, కాంగ్రెస్ పేరు కలిసి వచ్చేలా వైఎస్‌ఆర్సీపీ పేరుతో సొంత పార్టీ పెట్టుకొన్నారు. అది నచ్చని నాటి కాంగ్రెస్ సర్కారు అక్రమాస్తుల కేసులో జగన్‌ను జైలుకు పంపింది.
అయినా, ఆయన కుంగిపోకుండా స్థిరంగా నిలబడ్డారు. అంతలోనే ఉమ్మడి ఏపీ విడిపోవటంతో జగన్ సమైక్యాంధ్ర నినాదాన్ని ఎత్తుకోని కొత్త ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోయారు. కానీ, నవ్యాంధ్రలో తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో అధికారం దక్కించుకోలేకపోయారు. అయినా ఆయన కుంగిపోలేదు. మొండి పట్టుదలతో చంద్రబాబు పాలన చేసిన ఐదేండ్లూ ఎన్నడూ ఇంటిపట్టున ఉండకుండా ఓదార్పు యాత్ర పేరుతో రాయలసీమ దక్షిణ కొననుంచి కోస్తాంధ్ర ఉత్తర కొనవరకు కాలికి బలపం కట్టుకొని తిరిగారు.
ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలంలో ఒకటికి రెండుసార్లు ఓదార్పుయాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. ఆ ఐదేండ్లూ జగన్ పరిస్థితి ఉంటే జనంలో లేదంటే కోర్టులో అన్నట్టుగా ఉండేది. చివరకు ఆయన కష్టం వృథా పోలేదు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రజలు జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా అసెంబ్లీలో మూడింట రెండొంతుల మెజారిటీ సాధించారు. జగన్ ప్రభంజనంలో అప్పుడే రాజకీయాల్లోకి వచ్చి సినిమా హీరో ఇమేజ్‌తో ఉప్పెన లేపాలనుకొన్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ గాలిలో కొట్టుకుపోయారు. టీడీపీ కుదేలైంది.
శుభారంభం..
అద్భుత విజయంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రజల కోసం ఎన్ని మంచిపనులు చేశారో.. ఆయన వెనుకగా అన్ని చెడు పనులు కూడా జరిగాయి. వచ్చీ రావటంతోనే గ్రామాల్లో విప్లవాత్మక వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. వృద్ధాప్య పెన్షన్లతోపాటు అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు ఇండ్లవద్దకే తీసుకెళ్లి అందజేసేలా వ్యవస్థను నిర్మించారు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చి దిద్దారు.
అంతో ఇంతో పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. పాత జిల్లాలను విభజించి 26కు పెంచి పాలనా సంస్కరణలు చేపట్టారు. చంద్రబాబు పునాదులేసిన అమరావతి రాజధాని ప్రతిపాదనను తిరస్కరించి, రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి పాలన సాగుతుందని ప్రకటించారు. కేంద్రంలోని మోదీ సర్కారుకు నమ్మికగా ఉంటూ నిధులు కూడా రాబట్టారు. వెనుకబడిన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం ఇచ్చారు. ఆలయాలకు నిధులు పెంచారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి జీతాలు పెంచారు.
సొంత కుటుంబానికీ దూరం
వైఎస్ జగన్ సీఎం అయ్యాక సొంత కుటుంబాన్ని కూడా దూరం పెట్టారని విమర్శలు ఎదుర్కొన్నారు. సొంతంగా పార్టీ పెట్టుకొన్న కొత్తలో ఆయన జైల్లో ఉన్నప్పుడు పార్టీని ఆయన సోదరి, ప్రస్తుత ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తన భుజాలపై మోశారు. అన్న ఆపిన పాదయాత్రను చెల్లెలు కొనసాగించి పార్టీని బలోపేతం చేశారు. కానీ, జగన్ సీఎం కాగానే చెల్లెలిని బయటకు పంపించేశారు. కన్న తల్లి కూడా ఆయనకు దూరమయ్యారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో సొంత చిన్నాన్నను దారుణంగా హత్యచేస్తే.. నిందితులను పట్టుకొని శిక్షించలేకపోయారు. దీంతో జగన్‌ను టీడీపీ సైకో సీఎం అని ప్రచారం చేయటం మొదలుపెట్టింది.
చివరకు 2024 ఎన్నికల్లో తల్లి, చెల్లి కూడా తన ప్రతిపక్షంలో చేరిపోయి.. అన్న దారుణ ఓటమిలో తమవంతు పాత్ర పోషించారు. చివరకు ఆయన సొంత సామాజికవర్గమైన రెడ్లు కూడా జగన్‌కు దూరం జరిగారు. ఏపీలో రాజకీయంగా, ఆర్థికంగా, మీడియాపరంగా కమ్మ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. దాన్ని తగ్గించేందుకు జగన్ మొదటిరోజునుంచీ ప్రయత్నించారు. కమ్మలపై కాపులను ఎగేశారు.
కానీ, 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కమ్మ, కాపు సామాజికవర్గాలు ఏకమయ్యాయి. చంద్రబాబు, పవన్‌కల్యాన్ రాజకీయ పొత్తుతో దీనిని సాధ్యం చేశారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరటంతో జగన్‌ను హిందూ వ్యతిరేకిగా బలంగా ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడ్డారు. జగన్ అతి విశ్వాసం కూడా ఆయనను దారుణంగా దెబ్బతీసింది. అసెంబ్లీలోని మొత్తం 175 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకొంటామని గొప్పలు పోయి ‘వై నాట్ వన్ సెవన్టీఫై’ అనే నినాదాన్ని ఎత్తుకొన్నారు. అది మొదటికే మోసం తెచ్చింది.
అభ్యర్థుల మార్పుతో అభద్రత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యేలతోనే మళ్లీ ఎన్నికలకు వెళ్లి బీఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాన్ని గమనించిన వైఎస్ జగన్.. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఎడాపెడా మార్చేశారు. ఇదేమంటే మీపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని తన కోటరీతో చెప్పించారు. ఎమ్మెల్యేలు స్వయంగా కలిసి గోడు వెళ్లబోసుకుందామన్నా ఆయన అందుబాటులోకి రాలేదు. ఎంపీ, ఎమ్మెల్యే పదవుల్లో ఉండి చివరకు ఏనాడూ ఎన్నికల్లో గెలువని కోటరీ నేతల ముందు చేతులు కట్టుకొని నిలబడాల్సి వస్తున్నదే అన్న అసహనం నేతల్లో పెరిగిపోయింది.
కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను రెండుమూడుసార్లు మార్చటంతో నేతల్లో అభద్రతాభావం కూడా పెరిగింది. దీంతో అవకాశం దొరికితే పక్కపార్టీలోకి పోవాలని చూశారు. ఈ పరిస్థితిని టీడీపీ, జనసేన, బీజేపీ సొమ్ముచేసుకొన్నాయి. అధికారంలోకి వచ్చేందుకు జగన్ ఓదార్పు యాత్ర చేస్తే.. ఆయనను అధికారం నుంచి దింపేందుకు టీడీపీ నేత లోకేశ్ యువగళం యాత్ర నిర్వహించారు. పోగొట్టుకొన్న చోటనే వెతుక్కోవాలన్న ఆలోచనతో పవన్‌కల్యాణ్ ‘వారాహి’తో బస్సుయాత్ర నిర్వహించారు. వైసీపీ నేతలు ఈ యాత్రలను గేలిచేయటంతోనే సంతృప్తిపడ్డారు కానీ అవి ప్రజల్లో తీసుకొస్తున్న మార్పును గమనించలేకపోయారు.
ఇక వైసీపీ నేతల అరాచక చర్యలు కూడా వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలుగా మారాయి. ఐదేండ్లలో జగన్ క్రమంగా ప్రజలకు దూరమైతే.. చంద్రబాబు, పవన్ ప్రజలకు దగ్గరయ్యారు. దీంతో అసెంబ్లీ, ఎన్నికల్లో టీడీపీ, జనసేన అఖండ విజయం సొంతం చేసుకొంటే.. హారతులు పట్టించుకొన్న చోటనే జగన్ దారుణ అవమానం మూటగట్టుకొన్నారు. తనవైపు ఎంతో రాజకీయ అనుభవం ఉన్ననేతలు కూడా ఉన్నప్పటికీ ఇకపై ఆయన పునర్వైభవం.. స్వీయ తప్పులను సరిదిద్దుకోవటంతోపాటు చంద్రబాబు పనితీరుపైనే ఆధారపడి ఉంటుందనేది సత్యం.
అతితో తిరోగమనం
జగన్ ప్రభుత్వం ఎన్ని మంచి పనులు చేసినా.. చివరకు చెడు చర్యలే ప్రజల్లో నిలిచిపోయాయి. గ్రామ వాలంటీర్లకు అపరిమితి స్వేచ్ఛ ఇవ్వటం, వైసీపీ నేతలు వారిని సొంత అవసరాలకు వాడుకోవటంతో ఆ వ్యవస్థ జగన్‌కే ఎదురు తన్నింది. చాలా గ్రామాల్లో వాలంటీర్లను ప్రజలు పెద్ద సమస్యగా భావించటం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని జగన్ గుర్తించలేకపోయారు. నిజానికి వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటులో ఆయన స్వార్ధంకూడా ఉన్నదనే చెప్పవచ్చు. గ్రామాల్లోని ప్రజలను వైసీపీకి అనుకూలంగా మోటివేట్ చేయటానికి కూడా వారిని వాడుకోవచ్చని, అలా 2024 నాటికి రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదగొచ్చని ఆయన భావించారు. కానీ, వాలంటీర్లు గ్రామాల్లో జమీందార్లుగా అధికారం చెలాయించటం ప్రజలకు నచ్చలేదు. కొత్త ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్‌తో ఏర్పడింది. నిధులకు కటకటగానే ఉండేది. అయినా, ఆయన తాహతుకు మించి ఉచిత సంక్షేమ పథకాలు అమలు చేశారు.
వాటి అమలు కోసం దొరికి చోటల్లా అప్పులు చేశారు. చివరకు వచ్చేసరికి చిన్నచిన్న కారణాలు చెప్పి పెన్షన్ల సంఖ్యను తగ్గించారు. చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు ఆలస్యం చేశారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ తగ్గించారు. దీంతో ఆయా వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం మొదటికే మోసం తెచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన ప్రతి వ్యక్తిని పలకరించిన జగన్.. సీఎం అయ్యాక సొంత పార్టీ నేతలకే కనిపించటం మానేశారు. ఆయన ప్రజలకు ఏం చెప్పాలనుకొన్నా.. తన చుట్టూ ఉన్న నలుగురు ఆంతరంగికులతోనే చెప్పించేవారు. సీఎం ఎన్నటికైనా కలుస్తాడేమోనని వైసీపీ ఎంపీలు ఏండ్లపాటు ఎదురుచూసేలా చేశారు. అతి విశ్వాసంతో తాజా ఎన్నికల్లో కొత్తహామీలేవీ ఇవ్వలేదు. దాదాపు ౨౦౧౯ నాటి మ్యానిఫెస్టోనే ఈసారి కూడా ప్రజలముందు ఉంచారు. అదే సమయంలో చంద్రబాబు లెక్కకు మిక్కిలి తాయిలాలు ఇచ్చారు. వాటిని అమలుచేస్తారా? లేదా? అన్నది పక్కనబెడితే ప్రజలను మాత్రం ఆకట్టుకోగలిగారు.
రాజకీయ ప్రతీకారంతో చెడ్డపేరు
జగన్ పాలనలో రానురాను అంతకుముందు చంద్రబాబు వేసిన ప్రతి పునాది రాయిని పెకిలించాలన్న లక్ష్యం కనిపించింది. మొదట అమరావతి రాజధానిని రద్దుచేశారు. విశాఖ, అమరావతి, కర్నూల్ మూడు రాజధానులని ప్రకటించారు. వాటినైనా సరిగ్గా అభివృద్ధి చేశారా? అంటే అదీ లేదు. దీంతో రాష్ట్రం ఏర్పడి పదేండ్లయినా మా రాజధాని ఇదీ అని చెప్పుకోలేకపోతున్నామని ఆంధ్రులు ఆగ్రహించారు. వైఎస్ జగన్ క్రైస్తవ మతాన్ని అవలంభిస్తారన్నది అందరికీ తెలిసిందే. దీంతో ఆయన హిందూ ఆలయాలకు భారీగానే నిధులిచ్చిన్నా.. రాష్ట్రంలోని కొన్ని ఆలయాల్లో చోటుచేసుకొన్న అపచారాలు ఆయనను హిందూ వ్యతిరేకిగా నిలబెట్టాయి.
ప్రజలకు ఏనాడో దూరమవటంతో తన చుట్టూ ఉన్నవాళ్లు చెప్తున్నదే నిజమని నమ్మారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపటం జగన్‌ను రాజకీయంగా బాగా దెబ్బతీసింది. తెలుగు మీడియాలో అత్యధిక భాగం బాబుకు అనుకూలమైనదే కావటంతో జగన్ ప్రతి చర్యను ప్రజల్లోకి వ్యతిరేకంగా తీసుకెళ్లాయి. దాన్ని అడ్డుకోవటంలో ఆయన విఫలమయ్యారు. చంద్రబాబు అరెస్టును ఆయన మీడియా ప్రపంచ సమస్యగా చిత్రిస్తే.. ప్రభుత్వం మాత్రం ఆ అరెస్టుకు హేతుబద్ధమైన కారణాలు చెప్పలేకపోయింది. దీంతో జగన్ రాజకీయ కక్షతోనే చంద్రబాబును జైలుకు పంపారని ఆంధ్ర ప్రజలు నమ్మారు.
* చిన్నచిన్న కారణాలు చెప్పి పెన్షన్ల సంఖ్యను తగ్గించారు. చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు ఆలస్యం చేశారు. ఉద్యోగులకు ఫిట్‌మెంట్ తగ్గించారు. దీంతో ఆయా వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారాయి. కొత్తగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టం మొదటికే మోసం తెచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనిపించిన ప్రతి వ్యక్తిని పలకరించిన జగన్.. సీఎం అయ్యాక సొంత పార్టీ నేతలకే కనిపించటం మానేశారు. ఆయన ప్రజలకు ఏం చెప్పాలనుకొన్నా.. తన చుట్టూ ఉన్న నలుగురు ఆంతరంగికులతోనే చెప్పించేవారు. సీఎం ఎన్నటికైనా కలుస్తాడేమోనని వైసీపీ ఎంపీలు ఏండ్లపాటు ఎదురుచూసేలా చేశారు.
* ప్రజలకు ఏనాడో దూరమవటంతో తన చుట్టూ ఉన్నవాళ్లు చెప్తున్నదే నిజమని నమ్మారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును జైలుకు పంపటం జగన్‌ను రాజకీయంగా బాగా
దెబ్బతీసింది.
* కానీ, 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేనాటికి చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా కమ్మ, కాపు సామాజికవర్గాలు ఏకమయ్యాయి. చంద్రబాబు, పవన్‌కల్యాన్ రాజకీయ పొత్తుతో దీనిని సాధ్యం చేశారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరటంతో జగన్‌ను హిందూ వ్యతిరేకిగా బలంగా ప్రచారం చేశారు. దీంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడ్డారు.
సి.ఎల్.రాజం
చైర్మన్, విజయక్రాంతి






