ఉపాధి కరువై.. పోషణ భారమై
- రైలు కింద పడి నేతన్న బలవన్మరణం
కొత్తపల్లిలో వెలుగు చూసిన ఘటన
కరీంనగర్, జూన్ 15 (విజయక్రాంతి): సిరిసిల్ల ప్రాంతంలో సాంచలు ఆగిపోయాయి. నేతన్నల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబాన్ని పోషించలేక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనలేక ఇటీవల ఎంతో మంది నేత కార్మికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన మరో నేత కార్మికుడు రైలు కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బొల్లబత్తిని వెంకటేశం(64) అనే వృద్ధుడు భార్య, కుమార్తె, కుమారుడు కొత్తపల్లి పట్టణంలో నివాసం ఉంటున్నాడు. దశాబ్దాల నుంచి వెంకటేశం నేతపని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. భార్య బీడీలు చుడుతూ భర్తకు సాయం చేస్తుంటుంది.
ఆమె కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నది. కుమార్తె పెళ్లీడుకు వచ్చి ఇంట్లోనే ఉంటున్నది. కుమారుడికి యుక్త వయస్సు వచ్చినప్పటికీ ఉపాధి దొరకలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేశానికి ఆరు నెలల నుంచి నేతపని లేకుండా పోయింది. దీంతో కుటుంబ పోషణ భారమైంది. నెల నెలా కొంత బ్యాంక్ రుణం చెల్లించాల్సి ఉండగా, అది కూడా కట్టలేనేమోనని వెంకటేశం ఆందోళనకు గురయ్యాడు. దీంతో కొద్దిరోజులుగా వెంకటేశం ముభావంగా ఉంటున్నాడు. ఇక తాను కుమార్తె పెళ్లి చేయలేనని, భార్యకు చికిత్స అందించలేనని మనస్తాపంతో కొత్తపల్లి సమీపంలోని రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
కొత్త ప్రభుత్వం వచ్చినా..
కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వం నేతన్నలకు బతుకమ్మ చీరెల ఆర్డర్లు ఇస్తామ, రూ.70 కోట్ల మేర నిలిచిన పెండింగ్ బిల్లులను విడుదల చేస్తామని హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలపై ఇప్పటివరకు ఎలాంటి స్సష్టత లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో సిరిసిల్ల ప్రాంతంలో సుమారు 30 వేలకుపైగా మరమగ్గాలు మూలనపడ్డాయి. సుమారు 20 వేల కుటుంబాలకు ఉపాధి కరువై రోడ్డునపడ్డాయి. గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు నేసేందుకు ఏటా రూ.320 కోట్ల నిధులు కేటాయించేది. 2020 వరకు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు టెస్కో రూ.220 కోట్ల బకాయి పడింది. వీటిలో సర్కార్ రూ.150 కోట్లు చెల్లించగా, మరో రూ.70 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అలాగే 2022 సంవత్సరాలకు నేతన్నలకు రూ.18 కోట్ల రాయితీ కూడా అందాల్సి ఉండగా నిధులు అందలేదు. దీంతో నేత కార్మికులు పెట్టుబడి లేక వస్త్ర ఉత్పత్తిని పక్కన పెట్టారు. బిల్లుల విడుదల కోసం జనవలో ఆందోళనకు దిగారు. అయినా ప్రయోజనం లేకపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేతన్నల సమస్యలను పరిష్కరిస్తుందనుకుంటే అదీ జరగలేదు. దీంతో నేత కార్మికులు దిక్కుతోచని స్థితిలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకోగా, తాజాగా కొత్తపల్లిలో మరో బలవన్మరణం సంభవించింది. వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటకు వస్తుందన్న నేతన్న ఆశలు అడియాశలు కావడంతోనే బలవన్మరణాలు సంభవిస్తున్నాయనేది సుస్పష్టం.






