ఎన్ని కోట్ల సినిమా అని కాదు.. ఎలా ఉందన్నదే ముఖ్యం!
భరత్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్‌పై భరత్, సంతోష్ దర్శకత్వంలో, పీలం పురుషోత్తం నిర్మాణం లో వస్తోంది ‘జగన్నాథ్’ చిత్రం. రాయలసీమ భరత్, ప్రీతి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సారా, నిత్యశ్రీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. టీజర్, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం ఏపీ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరిగింది. టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా, జబర్దస్త్ కామెడియన్స్ అప్పారావు, వినోదిని, గడ్డం నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. “జగన్నాథ్’ టీజర్ అద్భుతంగా ఉంది. రాయలసీమ భరత్‌కు ఇది ఫస్ట్ మూవీ అయినా ఎంతో ప్రొఫెషనల్‌గా చేశాడు. అతని ఫ్రెండ్స్ అంతా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకోవడం చూ స్తుంటే ఆనందంగా ఉంది. ఈ రోజుల్లో సినిమా తీయడం అంత ఈజీ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఎంతో ఫ్యాషన్‌తో ఈ సినిమా తీశారు. కోటి రూపాయలతో తీస్తే చిన్న సినిమా అని.. వెయ్యి కోట్లతో తీస్తే పెద్ద సినిమా అనడానికి లేదు. ఏదైనా సినిమానే. కాకపోతే, బాగుందా? బాగాలేదా? అనేదే చూడాలి. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా’ అన్నారు. చిత్ర కథానాయకుడు రాయలసీమ భరత్ మాట్లాడుతూ.. ‘సినిమాలపై ఇష్టంతో ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చాను. నిరంతరం పనిచేస్తూ ‘జగన్నాథ్’ మూవీని పూర్తి చేశాం. ఇది మా ఐదేళ్ల శ్రమ” అని చెప్పారు.






