13 July, 2026 | 9:40 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సంగారెడ్డిలో జగ్గారెడ్డి హల్‌చల్!

12-02-2026 02:19 AM
  1.   34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకున్న సీఐ
  2. ఆగ్రహంతో పోలీసులతో జగ్గారెడ్డి వాగ్వాదం
  3. పోలింగ్ ఆపివేయిస్తానంటూ హెచ్చరిక
  4. సీఐ ఏమన్నా సినిమా హీరోనా అంటూ బూతు పురాణం

సంగారెడ్డి, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులకు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య భారీ వాగ్వాదం జరగడంతో పోలింగ్ కేంద్రం వద్ద రణరంగంలా మారింది. మున్సిపాలిటీలోని 34వ వార్డులో పోలింగ్ జరుగుతుండగా పోలీసులు కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న సీఐ శివకుమార్.. కాంగ్రెస్ అభ్యర్థి అడ్డును కాలర్ పట్టుకుని లాగడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.

సీఐ ప్రవర్తనపై కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసుల తీరుపై మండిపడుతూ పోలింగ్ ఆపేస్తానంటూ హెచ్చరించారు. ఆయన స్వయంగా పోలింగ్ బూత్‌లోకి వెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెల కొనడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సీఐ బీఆర్‌ఎస్ నాయకులకు తొత్తుగా పనిచేస్తున్నాడని, అతను ఏమన్నా సినిమా హీరోనా.. అత ను ఎన్ని విధాలుగా అడ్డుపడినా చూస్తూ ఊరుకున్నామని ఇక సహించేది లేదంటూ మండిపడ్డారు. నా మీద కేసులు పెట్టినా సరే సీఐ వ్యవహారం ఏమిటో తేల్చుకునేదాకా వదిలేది లేదని భీష్మించారు. దీంతో డీఎస్పీ అక్కడికి చేరుకొని జగ్గారెడ్డిని సముదాయించడానికి ప్రయత్నించారు. జగ్గారెడ్డి ససేమిరా అంటూ సీఐని దుర్భాషలాడుతూ అవసరమైతే పోలింగ్ ఆపేస్తామంటూ హెచ్చరించారు. అడిషనల్ ఎస్పీ అక్కడికి చేరుకొని కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదును స్వీకరించి సీఐపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హామీనివ్వడంతో జగ్గారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదు?

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో దొంగ ఓట్లు నమోదయ్యాయని, ఇతర ప్రాంతాల నుంచి ఓటర్లను తెచ్చి సంగారెడ్డిలో ఓటర్లుగా నమోదు చేశారని ఆరోపించారు. ఒక్కో వార్డులో 300లకు పైగా దొంగ ఓట్లు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేర్పిం చినట్లు ఆరోపించారు. అప్పుడు నమోదు చేసుకున్న దొంగ ఓట్లు ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో వేస్తున్నారని, దొంగ ఓట్లు వేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు.

అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్త కాలర్ పట్టుకొని సీఐ శివ కుమార్ నెట్టివేశారని చెప్పారు. తాను పోలింగ్ కేంద్రా నికి వెళ్లగా గొడవ జరిగిందన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆ దొంగ ఓట్లను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. ఈ గొడవ జరగడానికి ఎన్నికల కమిషన్, జిల్లా అధికారులు బాధ్యులు కారా అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ జవాబు చెప్పాలన్నారు. దొంగ ఓటర్లను అడ్డుకున్న తమపై కేసులు పెట్టాలని ఎన్నికల కమిషన్ చెప్పడం సరికాదన్నారు.