5 April, 2026 | 8:20 AM

జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి ఆదర్శం

05-04-2026 01:30 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డా. బాబూ జగ్జీవన్ రామ్ జీవితం దేశానికి ఆదర్శమని, ఆయన సేవలు చిరస్మరణీయమని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆదివారం బాబూజీ 119వ జయంతి సందర్భంగా సీఎం ఆయనను గుర్తు చేసుకున్నారు. దళితుల హక్కుల కోసం ఆయ న జీవితాంతం పోరాడారని గుర్తుచేశారు.

పేదరికంలో పుట్టినా, తన పట్టుదలతో ఉన్నత స్థాయికి ఎదిగారని, స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని, తొలి ప్రధాని నెహ్రూ మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారని తెలిపారు. అణగారిన వర్గాలు, కార్మికుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని, కుల వివక్ష, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారని పేర్కొన్నారు.

బాబూజీ స్ఫూర్తితోనే తెలంగాణ లో ప్రజాపాలన కొనసాగిస్తున్నామని, సామాజిక న్యాయం, అన్ని వర్గాల మేలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు. దేశానికే ఆదర్శంగా కులగణన చేపట్టామని, బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్య లు చేపట్టిందని, బాబూజీ ఆశయాలే తమకు మార్గదర్శకమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

జగ్జీవన్‌రామ్ ఆశయాలు ఆదర్శనీయం: మహేష్ కుమార్ గౌడ్

బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు అందరికి ఆదర్శమని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఆదివారం బాబు జగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిన మహానేత అని, అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. సమానత్వం, న్యాయం, సామాజిక సాధికారత కోసం ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శనీయమని తెలిపారు. బాబు జగ్జీవన్‌రామ్ ఆశయాలు స్ఫూర్తిగా తీసుకుని మనమంతా కృషి చేయాలని మహే ష్ కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.