18 July, 2026 | 2:18 PM

జనజీవన స్రవంతిలో కలవండి

16-12-2024 01:59 AM

లేకపోతే తీవ్ర పరిణామాలు

కఠిన చర్యలు తప్పవు

 కేంద్ర మంత్రి అమిత్ షా

రాయ్‌పూర్, డిసెంబర్ 15: నక్సలైట్లకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారు. నకల్స్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని పిలుపునిచ్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్‌పూర్‌లో జరిగిన ‘బస్తర్ ఒలింపిక్స్’ ముగింపు వేడుకల్లో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయుధాలను వీడి లొంగిపోయిన నక్సలైట్లకు పునరావాసం కల్పించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఒక వేళ నక్సల్స్ ప్రభుత్వ విజ్ఞప్తిని విస్మరిస్తే.. భద్రతా బలగాలతో కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ రహిత భారతదేశాన్ని రూపొందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని షా తెలిపారు. 2026 మార్చి నాటికి భారత్‌ను నక్సల్స్ రహితంగా మార్చాలన్న ప్రధాని నరేంద్రమోదీ సంకల్పాన్ని నెరవవేర్చేందుకు ఛత్తీస్‌గఢ్ పోలీసులు కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.

ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం నక్సల్స్ కోసం దేశంలోనే అత్యుత్తమ పునరావాస పాలసీని అమలు చేస్తోందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన హయంలో నక్సల్స్‌పై అంతంత మాత్రంగానే చర్యలు తీసుకుందని ఆరోపించారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సల్స్‌పై చర్యలను వేగవంతం చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 287 మంది నక్సల్స్‌ను హత మార్చినట్టు చెప్పారు.

ఇదే సమయంలో 992 మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. సుమారు 836 మంది జన జీవనస్రవంతిలో కలిసిపోయినట్టు వెల్లడించారు. అలాగే భద్రతా బలగాలు, సాధారణ పౌరుల మరణాల సంఖ్య భారీగా తగ్గినట్టు పేర్కొన్నారు. బస్తర్‌లో నక్సలిజం అంతం అయితే ఇక్కడి ప్రకృతి అందాలను చూసేందుకు కశ్మీర్ కన్నా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని తెలిపారు. బస్తార్‌లో మార్పు వస్తోందని చాలా మంది అంటున్నారు. అయితే 2026 బస్తర్ ఒలింపిక్స్ నాటికి ఈ ప్రాంతం పూర్తిగా మారిపోతుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు.