జన నాయగన్ సీన్లు లీక్!
నిర్మాణ సంస్థకు మద్దతు ప్రకటించిన స్టార్ హీరోలు
తమిళ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘జన నాయగన్’. దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా, మమితా బైజు కీలక పాత్రలో నటించారు. ఇదే విజయ్ ఆఖరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరిలోనే రావాల్సిన ఈ సినిమా సెన్సార్ అభ్యంతరాలు, రాజకీయ అడ్డంకుల కారణంగా ఇంకా విడుదల కాలేదు. ఎన్నో రిలీజ్ కష్టాలు ఎదుర్కొన్న ఈ చిత్ర నిర్మాతలకు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.
ఈ సినిమాలోని ఓ కీలక సన్నివేశం, ఓ పాట ఆన్‌లైన్‌లో లీక్ కావడం అందరినీ కలవరానికి గురిచేసింది. ఐదు నిమిషాల నిడివితో ఉన్న ఓ సన్నివేశం, విజయ్ ఇంట్రడక్షన్ సీన్, టైటిల్ కార్డ్స్, దళపతి కచేరీ అనే పాటలో కొంత భాగం సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఈ సన్నివేశాలను షేర్ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ హెచ్చరించింది. మరోవైపు సినీ ప్రముఖులు స్పందిస్తూ చిత్రబృందానికి మద్దతు ప్రకటిస్తున్నారు.
‘జన నాయగన్’ సీన్స్ లీక్ వార్త తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందంటూ టాలీవుడ్ అగ్ర నటుడు చిరంజీవి స్పందించారు. ‘నమ్మకం, శ్రమ, ఎంతోమంది సమిష్టి కలల సమాహారమే సినిమా. ఇలాంటి సంఘటనలు పరిశ్రమలోని మనందరినీ ప్రభావితం చేస్తాయి. మన క్రియేటివ్ వర్క్‌ను కాపాడుకోవడం ఎంతో కీలకమో గుర్తు చేస్తుంటాయి. ఈ నష్టాన్ని అరికట్టడంలో, దోషులను శిక్షించడంలో మేమంతా ఏకతాటిపై కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు మద్దతుగా నిలుస్తాం.
సినిమాను గౌరవించి, పరిరక్షించేందుకు మనమందరం మన మద్దతును అందిద్దాం’ అని మెగాస్టార్ పిలుపునిచ్చారు. ‘ప్రతి సినిమా వందలాది మంది రక్తం, చెమట, అభిరుచితో తయారవుతుంది. దయచేసి పైరసీకి దూరంగా ఉండండి. ఇలాంటి పనులకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో సినిమా చూడటం ద్వారా ఎదుటివారి కష్టాన్ని, ప్రతిభను గౌరవించడం నేర్చుకోండి’ అంటూ కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.




