12 May, 2026 | 3:40 AM

ప్రతి ఇంటికి జన్‌ధన్ ఖాతా

29-08-2024 07:33 AM
  1. దేశ ఆర్థిక వృద్ధికి బాటలువేసిన కార్యక్రమం 
  2. కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): దేశ ఆర్థిక వ్యవస్థలో వినూత్న సంస్కరణలకు, ఆర్థిక సమగ్రతకు ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం బాటలు వేసిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జన్‌ధన్ యోజన పథకం ప్రారంభమై బుధవారం నాటికి పదేళ్లు దాటిందని గుర్తుచేశారు. గత పదేళ్ల్లలో ఆర్థిక సమగ్రతకు, బ్యాంకు అకౌంట్లు లేని కోట్లాది మందిని బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వామ్యం చేయడంలో ఫలితాలు సాధించిందని అన్నారు.

పదేళ్లలో 53 కోట్ల కొత్త బ్యాంకు అకౌంట్లు తెరిచారని వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు, మరీ ముఖ్యంగా మహిళలకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు జమ అవుతున్నాయని చెప్పారు. ప్రజలకు జీరో బ్యాలన్స్ అకౌంట్లు ఓపెన్ చేయించడం, రూపే డెబిట్ కార్డులు అందించడంతో పట్టణ, గ్రామీణ ఆర్థిక అంతరం గణనీయంగా తగ్గిందని తెలిపారు.

ప్రజల ఆర్థిక సాధికారత విషయంలో ఇదో కీలక పరిణామమని పేర్కొన్నారు. జన్‌ధన్ యోజన పథకం కారణంగా ఇవాళ తెలంగాణలో 100% కుటుంబాలకు బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని తెలిపారు. తెలంగాణలో 1,19,49,137 అకౌంట్లు తెరవగా 86,76,385 రూపే కార్డులు అందజేసినట్లు వివరించారు. ఈ ఖాతాల్లో మొత్తం రూ. 4,389.88 కోట్లు జమచేయబడ్డాయని తెలిపారు.

ప్రజారోగ్యంపై సర్కారు నిర్లక్ష్యం

ప్రజారోగ్యం పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రజారోగ్యం, ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన అంశంలో కాంగ్రెస్ పార్టీ సైతం బీఆర్‌ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. ఆరోగ్య రంగానికి తగిన బడ్జెట్ కేటాయించకపోవడమే అందుకు ఉదాహరణ అని దుయ్యబట్టారు. ఉస్మానియా ఆసుపత్రిని నిర్లక్ష్యంచేసి పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారుస్తున్నారని విమర్శించారు.

రాష్ర్ట ప్రభుత్వం వానకాలం ప్రారంభమయ్యే ముందే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిర్లక్ష్యం ప్రదర్శించిందని మండిపడ్డారు. ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందటంతో ప్రజలకు సరైన వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. ఇప్పటికైనా ప్రజారోగ్యంపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.