12 May, 2026 | 2:26 AM

రాహుల్, సోనియాకు బెయిలెలా వచ్చింది?

29-08-2024 07:36 AM
  1. బీజేపీతో కుమ్మక్కయితేనే బెయిల్ వచ్చిందా? 
  2. తెలంగాణ తల్లి విగ్రహం రేవంత్ పెట్టకుంటేనే మంచిది 
  3. ఓటుకు నోటు కేసులో రేవంత్ బెయిల్‌పైనే ఉన్నారు 
  4. ఆయన ఆలోచనలన్నీ అష్ట వికారాలు 
  5. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటి కావడంతోనే కవితకు బెయిల్ వచ్చిందని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు పనికిమాలిన ప్రకటనలు చేస్తూ రాజకీయ ప్రయోజనం పొందాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. బీజేపీతో బీఆర్‌ఎస్ కుమ్మక్కయితేనే కవితకు బెయిల్ వస్తే.. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు కూడా బీజేపీతో కాంగ్రెస్ కుమ్మక్కయితేనే బెయిల్ వచ్చిందా? అని ప్రశ్నించారు.

ఇండియా కూటమిలో భాగమైన ఆప్ నేత సిసోడియాకు కూడా వారం రోజుల క్రితమే బెయిల్ వచ్చిందని గుర్తుచేశారు. ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి కూడా 2015  నుంచి బెయిల్‌పైనే ఉన్నారన్న సంగతి కాంగ్రెస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఇవన్నీ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు తర్వాతనే జరిగాయని, మీరంతా ఎన్డీయే భాగస్వాములేనని అనుకోవాలా? అని కేటీఆర్ నిలదీశారు. 

ఫెస్టివల్ ఆఫ్ ప్యూచర్‌కు కేటీఆర్‌కు ఆహ్వానం 

కేటీఆర్‌కు మరో అరుదైన గౌరవం దక్కిం ది. రష్యాలోని మాస్కోలో స్కోల్‌కోవో స్టార్టప్ సంస్థ ఏర్పాటు చేయనున్న ‘ఫెస్టివల్ ఆఫ్ ప్యూచర్ పోర్టల్’లో ప్రసగించేందుకు కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. రష్యా ప్రభు త్వం ఆధ్వర్యంలో వచ్చే నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఫెస్టివల్ ఆఫ్ ది ప్యూచర్ పోర్టల్ 2030 భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్యూచరిస్టిక్ అనే అం శంపై భవిష్యత్‌లో ఉండే అవకాశాలు, వాటిని వినియోగించుకునే విధానాలపై 30 నిమిషాలపాటు కేటీఆర్ మాట్లాడనున్నారు.  

తెలంగాణకు అక్కరకురాని వాళ్ల బొమ్మలను కచ్చితంగా తొలగిస్తాం 

సోనియాగాంధీని దెయ్యం, పిశాచి, బలిదేవత అన్న రేవంత్‌రెడ్డి.. రాజీవ్‌గాంధీపై ప్రేమ ఒలకబోస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. దొడ్డిదారి న పీసీసీ ప్రెసిడెంట్ అయిన రేవంత్‌రెడ్డి అసలు రంగు అందరికీ తెలుసని అన్నారు. రేవంత్‌రెడ్డి ఆలోచనలు కుసంస్కారంగా, అష్ట వికారంగా ఉన్నాయని మండిపడ్డారు. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటని అడిగితే కారుకూతలు కూస్తావా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘తెలంగాణ ఉద్యమం గుండెల్లో గునపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమాన మే’ అని అన్నారు. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటుందో.. రేవంత్‌రెడ్డి తీరు కూడా అలానే ఉంటుందని విమర్శించారు. ‘తెలంగాణకు అక్కరకు రాని వాళ్ల బొమ్మలను తొలగిస్తాం.. తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్టిస్తాం. ఇది రాసిపెట్టుకో’ అని కేటీఆర్ సవాల్ చేశారు.