12 May, 2026 | 4:48 AM

అభివృద్ధికి దారి ఆర్‌ఆర్‌ఆర్

29-08-2024 07:30 AM
  1. రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్‌మెంట్ 
  2. భూనిర్వాసితులపట్ల సానుభూతితో వ్యవహరించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 28 (విజయక్రాంతి): రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం అలైన్‌మెంట్ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. నూతనంగా ఏర్పడనున్న ఫోర్త్ సిటీలో నెలకొల్పనున్న పరిశ్రమలు, వాటిలో పని చేసే అధికారులు, సిబ్బందికి వారి కుటుంబాలకు విద్య, వైద్య, ఇతర వసతులు అందుబాటులో ఉండేలా అలైన్‌మెంట్ ఉండాలని సూచించారు.

జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సీఎం బుధవారం సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. గతవారం జరిగిన సమీక్షలో ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం అలైన్‌మెంట్‌లో సీఎం పలు మార్పులు సూచించారు. దానికి అనుగుణంగా అధికారులు అలైన్‌మెంట్‌లో కొన్ని మార్పులు చేశారు.

అందులో కొన్ని తేడాలు ఉండటంతో మరిన్ని మార్పులను సీఎం సూచించారు. ఆ మార్పులకు అనుగుణంగా అలైన్‌మెంట్ మార్చాలని... అది ఫైనల్ అయిపోతే తర్వాత కార్యాచరణ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

నిర్వాసితుల పట్ల సానుభూతితో వ్యవహరించండి

ఓఆర్‌ఆర్ నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల ప్రగతిపైనా సీఎం సమీక్షించారు. రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూసేకరణ చేయాలని సూచించారు. రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూమి సేకరించేటప్పుడు మానవీయ కోణంతో ఆలోచించి, నిర్వాసితులతో సానుభూతితో వ్యవహరించాలని సూచించారు.

సాధ్యమైనం త ఎక్కువ పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏ విధమైన సహాయం చేయగలమో చూసి అలా చేయాలని ఆదేశించారు. డ్రైపోర్ట్ నిర్మాణం విషయంలో మచిలీపట్నం, కాకినాడ రేవులను పరిగణన లోకి తీసుకోవాలని, తెలంగాణ ప్రయోజనాలకు ఏ రకంగా మేలు జరుగుతుందనే విషయం ప్రాధాన్యతలోకి తీసుకోవాలని సూచించారు. ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్‌పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

బెంగళూరులో జిందాల్ నేచర్ కేర్ పెట్టారని, మనకు ఉన్న అటవీ ప్రాంతం, అనుకూలతలు తెలియజేస్తే అటువంటివి ఎన్నో వస్తాయని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రాష్ర్ట ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.