వారిని బీజేపీలో చేర్చుకోం !
- బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఎప్పటికీ జరగదు
- కేసీఆర్, కేటీఆర్, కవిత చేరికపై ఎంపీ అర్వింద్ కామెంట్స్
నిజామాబాద్, ఆగస్ట్ 23 (విజయక్రాంతి): బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఎప్పటికీ జరగదని, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీలో చేర్చుకోమని ఎంపీ ధర్మపురి అర్వింద్ తేల్చిచెప్పారు. నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని రొటేషన్ చక్రవర్తిలా పాలిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమయ్యిందని విమర్శించారు. రాష్ట్రంలో 2.55 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తే కేవలం 30 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు.
పనికిమాలిన కండీషన్లు పెట్టి రైతుల్ని దగా చేశారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనకు రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ఎప్పటికీ జరగదన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ దగ్గరకు రానివ్వదన్నారు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తనను నాందేడ్ జిల్లా ఎన్నికల ఇన్‌ఛార్జీగా నియమించిందన్నారు. రుణమాఫీ కోసం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో చేపట్టనున్న ఆందోళనకు ఆయన మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో పల్లె గంగారెడ్డి, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ స్రవంతి రెడ్డి, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
నాందేడ్ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా అర్వింద్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాందేడ్ జిల్లా ఎన్నికల ఇన్‌చార్జిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నాందేడ్ జిల్లాను ఆయన సందర్శించి మాజీ సీఎం అశోక్ చౌహాన్‌తో పాటు ఇతర నాయకులతో సమావేశమయ్యారు.






