25-05-2025 08:36:14 PM
అశ్రునైనాల మధ్య వీడ్కోలు..
మంచిర్యాల (విజయక్రాంతి): కోల్ బెల్ట్ ప్రజలకు సుపరిచితుడు ప్రముఖ జర్నలిస్టు ఎండి మునీర్(Journalist MD Muneer) అనారోగ్యంతో కన్నుమూశారు. క్యాన్సర్ వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారుజామున కన్నుమూశారు. జర్నలిస్టు మునీర్ మృతి వార్త కార్మికలోకాన్ని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోనీ గౌతమ్ నగర్ లో నివసిస్తున్న ఎండి మునీర్ చిరకాలంగా పాత్రికేయుడిగా కోల్బెల్ట్ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలు అందిచ్చాడు. హైదరాబాదు నుంచి నుంచి ప్రత్యేక వాహనంలో మునీర్ పార్థివ దేహాన్ని మంచిరాల్లోని సొంత గృహానికి తీసుకొచ్చారు. ప్రజల సందర్శనార్థం ఇంటి ఆవరణలో భౌతికకాయాన్ని ఉంచారు.
ప్రముఖుల శ్రద్ధాంజలి, నివాళులు..
జర్నలిస్టు మునీర్ మృతి వార్త తెలిసిన వెంటనే జిల్లాలోని ప్రముఖులు, మాజీ ఎమ్మెల్యేలు జర్నలిస్టులు, రాజకీయ పార్టీల నాయకులు, రచయితలు, కవులు మంచిర్యాలకి తరలివచ్చారు. మునీర్ మృతదేహానికి శ్రద్ధాంజలి ఘటించి కుటుంబానికి సంతాపం తెలిపారు. ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, సామాజిక కార్యకర్త మహమ్మద్ హుస్సేన్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మాదన కుమారస్వామి,ఎమ్మెల్సీ కోదండరాం, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే లు నడిపెల్లి దివాకర్ రావు, కోనప్ప, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేణి శంకర్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామ్మూర్తి, హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ అహ్మద్, కార్మిక నాయకుడు కేoగర్ల మల్లయ్య నివాళులర్పించారు.
మునీర్ కు కన్నీటి వీడ్కోలు..
ప్రముఖ జర్నలిస్టు ఎండి మునీర్ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. మందమర్రి సీఆర్ క్లబ్ వెనకాల కబరస్థాన్లో అంత్యక్రియలు జరిగాయి. అక్కడ ఏర్పాటు చేసిన సంతాప సభలో ఎమ్మెల్సీ కోదండరాం, కార్మిక నాయకులు మాట్లాడారు. జర్నలిస్టు మునీరు మృతి ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుగా మునీర్ కీలక భూమిక నిర్వహించారని కొనియాడారు. ఆయన మృతి ఇటు పాత్రికేయ రంగానికి, ఉద్యమాలకు తీరని నష్టమన్నారు.